తిరుమల టెంపుల్ లో ఇదేం పని కొడాలి నాని!

కలియుగ వైకుంఠంగా చెప్పే తిరుమల పుణ్యక్షేత్రం ఎంతటి పవర్ ఫుల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2023-09-19 05:03 GMT

కలియుగ వైకుంఠంగా చెప్పే తిరుమల పుణ్యక్షేత్రం ఎంతటి పవర్ ఫుల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిబంధనలకు.. సంప్రదాయాలకు భిన్నంగా అప్పుడప్పుడు కొన్నిఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.అయినా.. దేవుడి దర్శనం కోసం వెళ్లినప్పుడు నిబంధనలకు భిన్నంగా వ్యవహరించటంలో అంతర్యం ఏమిటి? అన్నది అర్థం కానిది. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన మాజీ మంత్రి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిబంధనల్ని అతిక్రమించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆయన్ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వినమ్రతతో అడ్డుకున్నప్పటికీ ఆయన వారిని బుల్ డోజ్ చేస్తూ వెళ్లిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టువస్త్రాల్ని తీసుకురావటం తెలిసిందే. ఆయనకు తోడుగా కొందరు మంత్రులు సైతం ఆయన వెంట ఉంటారు. వీరంతా ఆలయ మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళతారు.

టీటీడీ నిబంధనల ప్రకారం చూస్తే.. రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక స్థాయి ఉన్న ప్రభుత్వాధినేతలు.. పాలకులకు మాత్రమే మహాద్వారం నుంచి తిరుమల ఆలయంలోకి నేరుగా వెళ్లే వీలుంది. కానీ.. ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి అలా వెళ్లే అవకాశం లేదు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆయనకంటే ముందుగా ఆలయ మహా ద్వారం నుంచి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు కొడాలి నాని. దీనికి టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read more!

మాజీ మంత్రి కొడాలి నానిని మహా ద్వారం నుంచి రావటం సరికాదని.. నిబంధనలు అంగీకరించవన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రెండు చేతులతోనమస్కరిస్తూనే.. ఆయన్ను లోపలకు వెళ్లే వీల్లేదని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సీరియస్ అయిన కొడాలి నాని తననే ఆపుతారా? అంటూ వాగ్వాదానికి దిగబోయారు. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సీవీ అండ్ ఎస్వో నరసింహ కిశోర్ మాజీ మంత్రిని లోపలకు పంపారు. నిబంధనలు అంగీకరించుకున్నా.. ముఖ్యమంత్రి కంటే ముందుగా తిరుమల టెంపుల్ లోకి వెళ్లిన వైనాన్ని పలువురు భక్తులు తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News