శ్రీవారి పింక్ డైమండ్ పై ఇంపార్టెంట్ అప్డేట్.. ఏడేళ్ల వివాదానికి తెర?
అయితే పింక్ డైమండ్ మాయమైనట్లు జరిగిన ప్రచారంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం లోతుగా విచారణ జరిపింది.;
2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసి.. 2019లో అధికారం పోవడానికి ఒక ప్రధాన కారణంగా ప్రచారం ఉన్న శ్రీవారి పింక్ డైమండ్ పై ముఖ్యమైన సమాచారం బయటపడింది. 2018లో ఎంతో విలువైన శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆరోపించి రాజకీయంగా అగ్గి రాజేశారు. దీనిపై అప్పటి నుంచి పెద్ద వివాదం కొనసాగింది. రమణ దీక్షితుల ఆరోపణలను వైసీపీ రాజకీయంగా వాడుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రమణ దీక్షితులు ఆరోపణలను పక్కన పడేయగా, పింక్ డైమండ్ అంటూ లేదని ఆ తర్వాత ప్రచారం జరగడంతో అంతా ఎన్నికల స్టంటుగా భావించారు.
అయితే పింక్ డైమండ్ మాయమైనట్లు జరిగిన ప్రచారంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం లోతుగా విచారణ జరిపింది. శ్రీవారి ఆభరణాలు, విలువైన వస్తువులపై పూర్తి సమాచారాన్ని సేకరించిన ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కీలక అంశాన్ని తాజాగా వెల్లడించారు. పింక్ డైమండ్ గా ప్రచారం చేసిన ఆభరణం అసలు వజ్రమే కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేశారు. మైసూరు మహారాజు 1945లో ఈ కెంపును శ్రీవారికి బహూకరించారని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి స్పష్టం చేశారు.
1945 జనవరి 9వ తేదీన మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని పింక్ డైమండ్ ప్రస్తావని అందులో లేదని తెలిపారు. దీంతో శ్రీవారికి పింక్ డైమండ్ లేదని రుజువైనట్లు అయిందని అంటున్నారు. మరోవైపు పింక్ డైమండ్ పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన సమాచారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
2018లో శ్రీవారి పింక్ డైమండ్ మాయమైనట్లు, దాన్ని జెనీవాలో వేలం వేసినట్లు అప్పటి ఆలయ అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెంటనే ఖండించారు. శ్రీవారి ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయని, ఏ వస్తువు మిస్ అవ్వలేదని వివరించారు. కానీ, అప్పట్లో ఈ అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ రాజకీయంగా వాడుకుంది. సుమారు ఏడేళ్ల తర్వాత పింక్ డైమండ్ వివాదానికి తెర దించుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టత ఇవ్వగా, అప్పడు ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ మళ్లీ టీటీడీ ఈవోగా నియమితులు అవడం విశేషం. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా బాధ్యతలు తీసుకునేందుకు తిరుమల వచ్చిన సందర్భంలోనే ఈ ప్రకటన వెలువడటం యాదృచ్ఛికమైనా పెద్ద చర్చ జరుగుతోంది.