శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాల్లో సరికొత్త రికార్డు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.;

Update: 2025-08-22 04:20 GMT

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు వెళ్లే భక్తులు మొదట స్వామి వారి దర్శనం కోసం ఎంతలా తపిస్తారో.. దర్శనమయ్యాక శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అంతలా తపిస్తారు. కుదిరినన్ని లడ్డూలు పట్టుకొని ఇంటికి బయలుదేరుతుంటారు. గతంలో లడ్డూ అమ్మకాల మీద సీలింగ్ ఉన్నా.. తర్వాతి రోజుల్లో ఆ తీరులో మార్పు రావటం తెలిసిందే.

కోరినన్ని లడ్డూలు ఇప్పటికి ఇవ్వకున్నా.. ప్రతి భక్తుడు అవసరాల్ని దాదాపు తీర్చేలా లడ్డూ ప్రసాదాల్ని అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే.. గత నెల (జులై)లో లడ్డూ అమ్మకాల్లో అదిరే రికార్డు నమోదైంది. రికార్డు స్థాయిలో నెలసరి అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. ఒకే రోజులో భారీ ఎత్తున లడ్డూ ప్రసాదాల విక్రయాలు సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు.

జులై 12న ఒక్కరోజులో 4,86,134 లడ్డూలను అమ్మినట్లుగా టీటీడీ చెబుతోంది. గత ఏడాది (2024) జులై ఇదే రోజున 3.24 లక్షల లడ్డూ ప్రసాదాల్ని అమ్మితే.. ఏడాది వ్యవధిలో లడ్డూ అమ్మకాలు 35 శాతం పెరగటం విశేషంగా చెప్పాలి. ఈ ఒక్క రోజు లడ్డూ విక్రయాల ద్వారా టీటీడీకి రూ.2.43 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది జులైలో చిన్న లడ్డూలు 1.045 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది 1.25కోట్ల లడ్డూలు అమ్మకాలు జరిగాయి.

భక్తుల రద్దీ కూడా అంతకంతకూ పెరుగుతోంది. గతానికి భిన్నంగా భక్తుల రద్దీ పెరిగిన సందర్భంలో లడ్డూ ప్రసాదాలను భక్తులకు సరిపడా అందుబాటులో ఉంచుతున్నారు. బఫర్ స్టాక్ కింద 4 లక్షల లడ్డూల్ని పెట్టుకుంటున్నారు. మొత్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News