కల్తీ నెయ్యి వ్యవహారం : తిరుమలే కాదు రాష్ట్రంలో ఏ ఆలయాన్ని వదల్లేదట..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో మరో దారుణం బయటపడిందని అంటున్నారు.;
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో మరో దారుణం బయటపడిందని అంటున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వివాదం నెలకొనగా, వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. భక్తుల మనోభావాలకు సంబంధించి అత్యంత సున్నితమైన ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ-ఏపీ పోలీసులతో సంయుక్తంగా ఏర్పడిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేయగా, మైండ్ బ్లోయింగ్ సమాచారం వెల్లడైనట్లు చెబుతున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి అసలు నెయ్యే కాదని ఇప్పటికే ఓ నివేదిక బయటకు రాగా, తిరుమలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు అన్నింటికి అదే నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ గుర్తించిందని చెబుతున్నారు. తిరుమల క్షేత్రానికి ఉత్తరప్రదేశ్ కి చెందిన భోలే బాబా డెయిరీ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. పవిత్రమైన ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంతో భోలే బాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరి మోహన్ రాణాను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండులో ఉన్న హరి మోహన్ రాణా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా, తాజాగా మూడోసారి బెయిలు కోసం హరిమోహన్ రాణా దరఖాస్తు చేసుకోగా, ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ ఓ పిటిషన్ దాఖలు చేసిందని అంటున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి కాంట్రాక్టు తీసుకున్న భోలే బాబా డెయిరీ కల్తీకి పాల్పడినట్లు ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగిలిన ఆలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యినే సరఫరా చేశారని సిట్ తరఫు న్యాయవాది తెలిపారు.
తిరుమల సహా ఇతర ఆలయాలకు భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుగంధ ఆయిల్స్, పామోలిన్ లతో కల్తీ నెయ్యిని తయారుచేసిన భోలే బాబా దానినే తిరుమల సహా ఇతర ఆలయాలకు సరఫరా చేసిందని న్యాయవాది జయశేఖర్ తెలిపారు. భోలే బాబా సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 2022లోనే బ్లాక్ లిస్టులో పెట్టారని, అయితే తిరుపతికి సమీపంలో ఉన్న మరో చిన్న డెయిరీతో ఒప్పందం చేసుకుని ఆ డెయిరీ పేరుతో కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు చెబుతున్నారు.
పూర్తి అవగాహనతోనే కల్తీ నెయ్యి సరఫరా చేశారని, వారి నేర స్వభావం వల్ల బెయిలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదించారు. కాగా, ఏపీపీ వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితుడు రాణాకు మరోమారు బెయిల్ తిరస్కరించింది. దీంతో మూడు సార్లు నిందితుడికి బెయిల్ లభించలేదని చెబుతున్నారు.