షాకిచ్చే కొందుర్గు లవ్ స్టోరీ.. పెళ్లికి ముందు ఆలోచిస్తే ఆత్మహత్య ఉండేదా?

తాజా విషాద ఉదంతాన్ని చూస్తే.. 24 ఏళ్ల శ్రీకాంత్ షాద్ నగర్ లోని ఒక కిరాణా షాపులో పని చేసేవాడు.

Update: 2024-04-03 04:48 GMT

తొందరపాటు.. మొండితనం.. కోరుకున్నది దక్కాలన్న ఆరాటంతో ఏది పడితే అది చేసేయటం.. ఆ వెంటనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి విషాద ఉదంతం ఒకటి షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమించేందుకు ఉండే ధైర్యం.. పెళ్లి తర్వాత ఎందుకు పోవాలి? పెళ్లి కోసం ఎంతకైనా అని సాహసించే వారు.. అంతే మొండితనంతో బతికి చూపించాలే తప్పించి పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడటం ఏ మాత్రం సరికాదు.

తాజా విషాద ఉదంతాన్ని చూస్తే.. 24 ఏళ్ల శ్రీకాంత్ షాద్ నగర్ లోని ఒక కిరాణా షాపులో పని చేసేవాడు. అతనికి రాజేంద్రనగర్ కు చెందిన పదహారేళ్ల బాలికతో పరిచయమైంది. త్వరగానే ప్రేమగా మారింది. వీరిద్దరు గత నెల 27న పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఉత్తరాసిపల్లెలోని తన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు శ్రీకాంత్. కొడుకు చేసిన పని గురించి తర్వాత మాట్లాడదామన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తమ పెళ్లిని అమ్మాయి తరఫు వారు ఒప్పుకోరని.. ఆమెకు పదహారేళ్లు కావటం వల్ల తను మైనర్ అవుతుందని.. అదో సమస్యగా మారుతుందన్న భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి వారిద్దరూ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి.. పురుగుల మందు తాగారు. వీరిని గమనించిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.

Read more!

మెరుగైన వైద్యం కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు.అయినప్పటికీ వీరిద్దరి ప్రాణాల్ని వైద్యులు కాపాడలేకపోయారు. ఏప్రిల్ ఒకటి (సోమవారం) అమ్మాయి.. ఏప్రిల్ 2 (మంగళవారం) శ్రీకాంత్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ప్రేమించే ముందు.. పెళ్లి చేసుకోటానికి ముందు కానీ ఇదే అంశం మీద మరింతగా ఆలోచించి ఉంటే.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News