దేశంలోనే తొలి చేతిమార్పిడి ఆపరేషన్‌!

ఈ శస్త్ర చికిత్సలు భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను కలిగిస్తున్నాయి.

Update: 2024-01-23 00:30 GMT

వివిధ ప్రమాదాల్లో, దురదృష్టవశాత్తూ చేతులు కోల్పోయినవారికి ఇది నిజంగా శుభవార్తే. మనదేశంలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన చేతిమార్పిడి ఆపరేషన్‌ ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు హరియాణాలోని ఫరీదాబాద్‌ లో ఉన్న అమృత ఆస్పత్రి వేదికైంది. ఈ శస్త్ర చికిత్సలు భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను కలిగిస్తున్నాయి.

వివిధ ప్రమాదాల్లో చేతిని కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు ఏకకాలంలో విజయవంతంగా అమృతి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించి వేరే వ్యక్తుల చేతులను అమర్చారు. చేతిని అమర్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గతంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి కావడం విశేషం. సాధారణంగా కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు చేయిమార్పిడి ఆపరేషన్‌ నిర్వహించడం చాలా సంక్లిష్టమని వైద్యులు చెబుతున్నారు. అలాంటిదాన్ని కూడా తాజాగా అమృత ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర భారతదేశానికి చెందిన గౌతమ్‌ తాయల్‌ కు 65 ఏళ్ల వయసు. ఆయన రెండేళ్ల క్రితం ఒక పారిశ్రామిక ప్రమాదంలో మణికట్టు వరకు తన ఎడమ చేతిని కోల్పోయారు. ఈయనకు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. ఈ నేపథ్యంలో చేతిని కోల్పోయిన గౌతమ్‌ తాయల్‌ కు బ్రెయిన్‌ డెడ్‌ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేతిని వైద్యులు అమర్చారు.

కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేతి మార్పిడి ఆపరేషన్‌ జరగడం దేశంలో ఇదే తొలిసారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యశాస్త్రంలో దీన్నొక అరుదైన ఘట్టంగా పేర్కొంటున్నారు. ఇలా చేతి మార్పిడి ఆపరేషన్‌ చేయడం చాలా సంక్లిష్టతతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు. రెండు ఎముకలు, రెండు ధమనులు, సుమారు 25 స్నాయువులు, 5 నరాలను కలిపి చేతి మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని అమృత ఆస్పత్రి వైద్యుడు మోహిత్‌ శర్మ వివరించారు.

Read more!

చేతిమార్పిడి ఆపరేషన్‌ తర్వాత రోగి గౌతమ్‌ తాయల్‌ మంచిగానే కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అతని కొత్త చేతిలో కదలికలు కూడా మొదలయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే తమ పరిశీలనలో ఉన్నారని.. మరో వారంలో ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు.

కాగా మరో చేతి మార్పిడి ఆపరేషన్‌ ను ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల దేవాన్ష్‌ గుప్తా అనే వ్యక్తికి నిర్వహించారు. మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో అతడు తన రెండు చేతులను మోచేయి పైభాగం వరకు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో దేవాన్ష్‌ కు ఫరీదాబాద్‌ లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తో మరణించిన వ్యక్తి రెండు చేతులను వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఈ సర్జరీ తర్వాత దేవాన్‌‡్ష పరిస్థితి కూడా మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు.

చేతి మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న రోగులు గౌతమ్‌ తాయల్, దేవాన్‌‡్ష గుప్తా సైతం.. ఇది తమ జీవితానికి రెండో అవకాశమని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తు జీవితంపై కొత్త ఆశలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

Tags:    

Similar News