కనిపించకుండా పోయిన చైనీస్ సూపర్ బ్యాంకర్.. ఇన్నాళ్లకు మళ్లీ!

ఏడాది క్రితం కనిపించకుండా పోయిన ఆయన వైనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Update: 2024-02-03 05:23 GMT

అతడు అలాంటి ఇలాంటి బ్యాంకర్ కాదు. చైనాలోని టెక్ కంపెనీల్ని శాసించిన సత్తా ఆయన సొంతం. రెండు పెద్ద కంపెనీల మధ్య మధ్యవర్తిత్వం చేసి.. విలీనాలు చేయటం మొదలుకొని ఎన్నో కంపెనీలకు గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తూ టెక్ కంపెనీల ప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించినట్లుగా పేరు సొంతం చేసుకున్నారు చైనీస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ బావో ఫాన్. ఏడాది క్రితం కనిపించకుండా పోయిన ఆయన వైనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇతడి గాయబ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన వార్తల్లోకి వచ్చారు. కారణం.. ఆయన మళ్లీ తిరిగి తెర మీదకు రావటమే.

తాజాగా తెర మీదకు వచ్చిన ఆయన.. తాను స్థాపించిన చైనా రినయ్ సెన్స్ ఛైర్మన్ కం సీఈవో పదవికి రాజీనామా చేసినట్లుగా కంపెనీ తెలిపింది. ఎందుకిలా? అంటే.. ఆరోగ్య కారణాలు.. కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ సమయం గడపటానికి కంపెనీలో తన పదవుల్ని వదులుకున్నట్లుగా పేర్కొంది. ఆయన రాజీనామాకు సంబంధించి మరే వివరాల్ని కంపెనీ వెల్లడించలేదు. షేరు హోల్డర్స్ కు ఆయన వివరాలు తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొనటం గమనార్హం.

చైనా టెక్ పరిశ్రమలో ప్రముఖ బ్యాంకర్ అయిన బావో ఫాన్ 2005లో బీజింగ్ లో చైనా రినయ్ సెన్స్ ను స్థాపించి.. అగ్రశ్రేణి డీల్ మేకర్ లో ఒకరిగా ఆయనకు పేరుంది. ఒక టైంలో ఇండస్ట్రీని శాసించినట్లుగా చెబుతారు. ఆయన నోటి మాటకు హవా ఉండేది. చైనాలోని రెండు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ సర్వీసులు మీటువాన్.. డయాన్ పింగ్ మధ్య విలీనాన్ని 2015లో కుదిర్చారు బావో ఫాన్. ఈ రోజున రెండు కంపెనీల ఉమ్మడి ప్రొడక్టు ‘సూపర్ యాప్’ ఈ రోజున చైనా మొత్తం విస్తరించింది.

Read more!

సంస్థ కీలక పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో అతడి స్థానంలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు జీయిజింగ్ ను కొత్త ఛైర్మన్ గా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటివరకు యాక్టింగ్ సీఈవోగా నిర్వహిస్తున్న హోదాను సీఈవోగా మారుస్తున్నారు. ఏడాదిగా కనిపించకుండా పోయిన బావో ఇప్పుడెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లాంటి వివరాల్ని కంపెనీ వెల్లడించలేదు. గత వేసవిలో కార్పొరేట్ లంచం అనుమానిత కేసులో ఆయన్ను విచారిస్తున్నట్లుగా ఒక నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ఏమైనా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారు హటాత్తుగా కనిపించకుండా పోవటం.. ఆ తర్వాత మళ్లీ తిరిగి వచ్చినా చడీ చప్పుడు లేకుండా అలా వచ్చేసి ఇలా వెళ్లిపోవటం చూస్తే మాత్రం మిస్టరీగా అనిపించకమానదు.



Tags:    

Similar News