టీపాయ్ మోసిన సీఎం విజయ్.. “CM అంటే కామన్‌మ్యాన్” అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు

వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు నిజ జీవితంలోనూ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త చరిత్రను లిఖించారు;

Update: 2026-05-10 09:18 GMT

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు నిజ జీవితంలోనూ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త చరిత్రను లిఖించారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేతగా ఎన్నికల బరిలోకి దిగి ప్రభంజనం సృష్టించిన విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకారం

చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ వేదికపై గవర్నర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక ముగిసిన వెంటనే ఆయన నేరుగా తమిళనాడు సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయం వద్ద చీఫ్ సెక్రటరీ సాయికుమార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన విజయ్.. తన కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రి కుర్చీలో ఆసీనులయ్యారు.

సినిమాల్లో అన్యాయంపై పోరాడే నాయకుడిగా చూసిన తమ అభిమాన హీరో ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే స్థానంలో కూర్చోవడం చూసి అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మిఠాయిలు పంచుతూ బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'సీఎం సెల్ఫీ'

ఈ చారిత్రాత్మక ఘట్టంలో విజయ్ తీసుకున్న కొన్ని వ్యక్తిగత దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి విజయ్ తీసుకున్న సెల్ఫీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనంతరం స్టేడియానికి భారీగా తరలివచ్చిన తన అభిమానులను బ్యాక్‌గ్రౌండ్‌లో చూపిస్తూ ఆయన ఒక ప్రత్యేక సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. "ఇది జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. మా సీఎం ఎప్పుడూ మా మనిషే" అంటూ అభిమానులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ కంటే సామాన్య ప్రజలతో అనుబంధానికే ఆయన ప్రాముఖ్యత ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.

మాయ చేయని వినయం.. వైరల్ అవుతున్న వీడియో

ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యలో జరిగిన ఒక చిన్న సంఘటన విజయ్ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది. వేదికపై ఉన్న టీపాయ్‌ను సిబ్బంది పక్కకు జరుపుతుండగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా చేయందించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి పనులు చేయరని.. కానీ విజయ్ తనలోని సామాన్యుడిని చాటుకున్నారని జనం ప్రశంసిస్తున్నారు.

వైరల్ అవుతున్న కామెంట్స్

"రియల్ కామన్ మ్యాన్ సీఎం" అని అధికార గర్వం లేని నాయకుడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. "సీఎం అంటే చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదు.. కామన్ మ్యాన్" అంటూ నెటిజన్లు కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. ఎదిగే కొద్దీ ఒదగడం అంటే ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక భారీ మార్పుకు సంకేతం. ఎందరో సినీ దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ గడ్డపై విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రవర్తనలోనూ సరళతను ప్రదర్శిస్తూ ఆయన తీసుకున్న తొలి అడుగులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పారదర్శకమైన పాలన అందిస్తారనే ఆశతో ఉన్న ప్రజల ఆకాంక్షలను విజయ్ ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News