'తిరుపతి' కూటమిలో కుమ్ములాట.. సరిదిద్దలేరా ..!
అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి కలివిడి నేత బీర చందంగానే మారింది.;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అందరూ కలిసి ఉండాలని.. నాయకులు కలివిడిగా ఉండాలని కూటమి పార్టీల అధినేతలైన చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి కలివిడి నేత బీర చందంగానే మారింది. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఉప్పు-నిప్పు తరహాలో వ్యవహరి స్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి కూడా చేరిపోయింది.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన ఖాతాలోకి చేరింది. ఆ పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులు విజయం దక్కించుకున్నారు. ఈయన వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు. పైగా ఎన్నికలకు ముందు మాత్రమే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులతో ఈయన కలివిడిగా ఉండలేకపోతున్నారు. ఇది జనసేనలో తరచుగా చర్చకు వస్తోంది. ఇక, టీడీపీలో ఉండి.. పనిచేసిన వారిలో కొందరికి మాత్రమే ఈ ఏడాది పదవులు దక్కాయి.
మిగిలిన వారికి దక్కలేదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకున్నారు. కానీ, ఆమెతోపాటు పనిచేసిన కొందరికి మాత్రం ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో పార్టీలో యాక్టివ్ నెస్ తగ్గించారు. మరోవైపు.. జనసేనలో ఆది నుంచి కిరణ్ రాయల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పటికీ.. ఆయన యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ.. గత ఎన్నికల్లో ఏకంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అనుకున్నా.. అది దక్కలేదు.
పోనీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అయినా తనకు న్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు. కానీ.. ఇదే జిల్లా నుంచి పసుపులేటి హరిప్రసాద్‌కు నామినేటెడ్ పదవి.. హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పోస్టు దక్కింది. ఇది కిరణ్‌ను నిరుత్సాహ పరిచింది. ఇక, బీజేపీలో ఉన్న భాను ప్రకాష్‌కు చిట్టచివరి నిమిషంలో టీటీడీ బోర్డు మెంబర్ సీటు లభించింది. అయితే.. దీనిని ఆయన అధిష్టానంతో మాట్లాడి తెచ్చుకోవడంతో స్థానికంగా ఉన్న పెద్దలతో ఆయన కలివిడిగా ఉండడం లేదు. దీంతో ఈ మూడు పార్టీల్లోనూ పదవులు ఆశించిన వారు భంగ పడ్డారన్న చర్చ ఉంది. దీంతో కలివిడి లేకపోవడంతో పాటు విడివిడిగానే ఉంటున్నా రు.