తెలంగాణ నాగేశ్వర్ ఏపీతో పనేందని ఆంధ్రోళ్లు అడగరేం?
ప్రాంతం మీద అభిమానం తెలంగాణ వారికే పరిమితమా? ఆంధ్రోళ్లకు అలాంటివేమీ ఉండవా? ఒకవేళ ఉండవనే అనుకుందాం.
ప్రాంతం మీద అభిమానం తెలంగాణ వారికే పరిమితమా? ఆంధ్రోళ్లకు అలాంటివేమీ ఉండవా? ఒకవేళ ఉండవనే అనుకుందాం. కనీసం తమ పార్టీని.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడే తెలంగాణ మేధావిని నిలదీయాలన్న ఆలోచన కూడా తెలుగు తమ్ముళ్లకు రాదా? తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన (ఉమ్మడి అదిలాబాద్ జిల్లా)
ఫ్రొఫెసర్ నాగేశ్వర్.. కేంద్ర హోంమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడుకున్న మాటల్ని.. తన చెవులతో విన్నట్లుగా విశ్లేషించటం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. కూటమి సర్కారులో చిచ్చు రేపేలా మాట్లాడటం వెనకున్న ప్లానింగ్ ఏమిటన్న ప్రశ్నను సంధించాల్సిన అవసరం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే కాదు.. జనసైనికులకు కూడా ఉందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన జరిగి పుష్కరం దాటేసినప్పటికి.. అవసరానికి తెలంగాణ సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకొచ్చే తెలంగాణ నేతల మాదిరి ఏపీ అధికార పార్టీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడరేంటి? అన్నదిప్పుడు చర్చగా మారింది.
తెలంగాణకు చెందిన ఏ పార్టీ అయినా సరే.. తమ ప్రయోజనాలు దెబ్బ తినేలా.. తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మాట్లాడే సాటి తెలుగువారికి ప్రాంతాన్ని అంటకట్టేయటం చూస్తుంటాం. అలాంటి తెలివి ఏపీ రాజకీయ ప్రముఖులకు.. మేధావులకు ఉండదేంటి? అన్నది అసలు ప్రశ్న. ఏపీ రాష్ట్ర విభజన జరిగిన వేళలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఏపీ ప్రజల మనోభావాల గురించి కానీ.. వారి మనోవ్యధ గురించి మాట్లాడటానికి నోరు రాని ప్రొఫెసర్ నాగేశ్వర్.. విభజన తర్వాత ఏపీ రాజకీయాల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నట్లు? అన్నది మరో ప్రశ్న.
విభజన జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రానికి పరిమితం కావాలన్నట్లుగా తెలంగాణ నేతలు.. మేధావులు.. ఇతర పక్షాలకు చెందిన వారు పదే పదే ప్రస్తావిస్తున్న తరుణంలో.. కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేపేలా ఎలా మాట్లాడతారు? అన్న సూటిప్రశ్నను ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సంధించాల్సిన అవసరం ఉంది కదా? అవేమీ ఏపీకి చెందిన నేతలకు.. మేధావులకు ఎందుకు పట్టదు? విభజన తర్వాత తెలంగాణకు చెందిన ఎందరో ఏపీలో కొలువు తీరిన ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించిన వైనాన్ని చూస్తున్నదే. అందుకు కూటమి సర్కారు సైతం మినహాయింపు కాదు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏపీ ప్రాంతాలకు చెందిన వారు తర్వాత.. కనీసం ఆ మూలాలు ఉన్నా సరే ససేమిరా అనటం చూస్తున్నప్పుడు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు ఏపీ రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నారు? అన్న ప్రశ్నను సూటిగా సంధించాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాజకీయ నేతలు.. మేధావుల వాదనల్నే పరిగణలోకి తీసుకుంటే.. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. తన మాటలతో అదే పనిగా కెలికేస్తున్న వైనాన్ని ఎందుకు తప్పు పట్టరు?
ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ మొదట్నించి చంద్రబాబు.. నరేంద్రమోడీని ఏదోలా తప్పు పడుతూ.. వారిని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆయన విశ్లేషణల వీడియోల్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఇదంతా తెలిసిందే. అయితే.. ఇక్కడ పాయింట్ ఏమంటే.. రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా తన మాటలతో.. విశ్లేషణలతో అధికారపార్టీని ఇరుకున పడేలా మాట్లాడిన వేళలోనూ.. ఆయా పార్టీలకు చెందిన వారు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవటమే అసలు సమస్య.
ఈ రోజు అమిత్ షా.. పవన్ కల్యాణ్ మాట్లాడుకున్న మాటల్ని బయటపెట్టిన ఆయన.. రేపొద్దున ఇలా ఇద్దరు మాత్రమే పరిమితమైన సమావేశాల సంభాషణల్ని.. తనకున్న సోర్సు ద్వారా తెలుసుకున్నట్లుగా విశ్లేషిస్తూ.. కొత్త పంచాయితీలు పెట్టే తీరును స్వాగతించాల్సిన అవసరం ఉందా? అన్నది తెలుగు తమ్ముళ్లు మాత్రమే కాదు.. జనసైనికులు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఆంధ్రోళ్లకు ప్రాంతీయ అభిమానం కూసింత కాదు చాలా అంటే చాలా తక్కువే అన్నది తాజా ఎపిసోడ్ తో మరోసారి నిరూపితమైందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.