‘‘చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం’’ ఆయనదే.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-05-22 07:00 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ మాజీ సీఎంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం’’ ఆయనకు ఇవ్వొచ్చు అబ్బా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని, తన తాత, తండ్రి, చిన్నాన్న మరణాలకు టీడీపీ కారణమన్నట్లు మాజీ సీఎం ఆరోపించడంతో మంత్రి లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘ఈ రోజు జగన్మోహనరెడ్డి గారి ప్రెస్మీట్ ఎవరైనా చూశారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం ఆయనకు ఇవ్వొచ్చు అబ్బా.. సొంత తల్లిని మోసం చేశారు.. సొంత తండ్రిని మోసం చేశారు.. సొంత చెల్లిని మోసం చేశారు.. ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహనరెడ్డి గారు..’’ అంటూ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో విపక్షంపై పంచ్ లు ఎక్కుపెడుతున్న లోకేశ్ ఈ సారి ‘‘చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం’’ అంటూ పంచ్ డైలాగ్ పేల్చి టీడీపీ కార్యకర్తలను ఉర్రూతలూగించారని అంటున్నారు.

లండన్ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత గురువారం తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి చంద్రబాబుపైన సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం కడప జిల్లాలో పర్యటించిన మంత్రి లోకేశ్ మాజీ సీఎం జగన్ సొంత గడ్డపై నుంచే ఆయన విమర్శలను తిప్పికొట్టారు. చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం జగన్ దే అంటూ చెప్పడమే కాకుండా.. జగన్మోహనరెడ్డి వ్యక్తిత్వంపైన రాజకీయాలపైన సూటి విమర్శలతో విరుచుకుపడ్డారు.

బయట ముద్దులు.. లోపల గొడ్డలి పోటు వేస్తున్న వైసీపీకి గొడ్డలి పార్టీ పేరు పెట్టినట్లు చెప్పారు. ఎవరైతే చట్టాలు ఉల్లంఘిస్తారో, వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. పలానా వ్యక్తి బాబాయ్ ని, మామయ్యని అనుకుంటే.. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని కాపాడలేరని తేల్చిచెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా, టీడీపీ నేతలు, కార్యకర్తలను తీవ్రంగా వేధించారని పార్టీని కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కేడర్ ను కాపాడుకోడానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.

కాగా, లోకేశ్ రియాక్షన్ తో అధికార, విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. తన పార్టీని గొడ్డలిపార్టీ అంటూ టీడీపీ నేతలు విమర్శించడంపై ఘాటుగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి టీడీపీదే గన్ కల్చర్ అంటూ ధ్వజమెత్తారు. తన తండ్రి మరణం వెనుక ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా వివేకా హంతకులను కాపాడుతున్నారని నిందించారు. ఈ ఆరోపణలపై మంత్రి లోకేశ్ అంతే తీవ్రంగా స్పందించడంతో ఇరుపార్టీల మధ్య డైలాగ్ వార్ రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ఇక గతంలో ఎన్నడూలేనివిధంగా ‘‘చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నెంబర్ వన్ స్థానం’’ అంటూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డిపై కొత్త పంచ్ పేల్చడంతో వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.



Tags:    

Similar News