ప్రపంచ వార్తల్లో నిలిచిన మెలోడీ చాక్లెట్ యజమాని ఎవరు?
పార్లే మెలోడీ. ఒకటి కాదు రెండు కాదు నలభై మూడేళ్ల చరిత్ర ఉన్న చాక్లెట్. కానీ.. రోజులో దాన్ని అంతర్జాతీయంగా ఫేమస్ చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
పార్లే మెలోడీ. ఒకటి కాదు రెండు కాదు నలభై మూడేళ్ల చరిత్ర ఉన్న చాక్లెట్. కానీ.. రోజులో దాన్ని అంతర్జాతీయంగా ఫేమస్ చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ. నిన్నటివరకు రూపాయి చాక్లెట్ కాస్తా ఇప్పుడు మోడీ మెలోడీగా మారింది. ఇంతకూ ఈ చాక్లెట్ కథేంటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ చాక్లెట్ కు వచ్చిన పేరు నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరగటం.. అప్పర్ సర్క్యుట్ లో 5శాతం నమోదు కావటం ఒక విశేషం. అయితే.. స్టాక్ మార్కెట్ లో మెలోడీ చాక్లెట్ల షేర్లు కొన్నవారంతా తప్పులో కాలేశారు. ఎందుకంటే.. ఈ కంపెనీ అసలు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కాదు. పార్లేకు చెందిన ఈ చాక్లెట్ ను పొరపాటున పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేర్లు కొన్నారు. వాస్తవానికి ఈ సంస్థ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఇలా ఒక కంపెనీ అనుకొని మరో కంపెనీ షేర్లను ఎగబడి కొన్న అరుదైన సందర్భంగా చెప్పాలి. ఈ తరహా క్రేజ్ చాలా అరుదు. మెలోడీ చాక్లెట్లను ఉత్పత్తి చేసే కంపెనీ ఏంటి? దీని యజమాని ఎవరు? ఎందుకని ఈ సంస్థ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కాలేదు? లాంటి అంశాలతో పాటు.. అసలీ మెలోడీని ఏ ఉద్దేశంలో నాలుగు దశాబ్దాల క్రితం పార్లే సంస్థ మార్కెట్ లోకి తెచ్చిందన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
మెలోడీ చాక్లెట్లను ఉత్పత్తి చేసే సంస్థ పేరు పార్లే ప్రొడక్ట్స్. ఇదో కుటుంబ కంపెనీ. అందుకే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్టు కాలేదు. పేరుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినప్పటికి మార్కెట్ లో లిస్టు కాకపోవటానికి కారణం.. ఇది ఒక కుటుంబం చేతిలో ఉన్న సంస్థగా చెప్పాలి. చౌహాన్ కుటుంబం ఈ కంపెనీని నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలో వాడే పలు బ్రాండ్లు ఈ కుటుంబం నిర్వహించే వ్యాపారాలకు సంబంధించినవి కావటం ఒక విశేషంగా చెప్పాలి. సాధారనంగా ఏ కంపెనీ అయినా తమ వ్యాపారాన్ని విస్తరించటానికి.. కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేందుకు.. మరింత ఆధునీకీకరణ కోసం.. ఇతర వ్యాపారాలకు విస్తరించటానికి అవసరమైన పెట్టుబడుల కోసం ప్రజల నుంచి నిధులు సేకరిస్తారు. ఇందుకు కంపెనీకి చెందిన వాటాలు షేర్ల రూపంలో ఇస్తారు. సదరు కంపెనీ పని తీరు ఆధారంగా స్టాక్ మార్కెట్ లో దాని విలువ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంటుంది.
మెలోడీ చాక్లెట్లను ఉత్పత్తి చేసే పార్లే ప్రొడక్ట్స్ సంస్థకు చెందిన ఉత్పత్తుల గురించి తెలిస్తే.. ఆ సంస్థకు నిధుల అవసరం లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. దశాబ్దాల తరబడి చేస్తున్న కుటుంబ వ్యాపారంలో నాలుగైదు వర్టికల్స్ లో వ్యాపారాన్ని చేస్తుంటారు. దేశీయ బిస్కెట్ గా చెప్పే పార్లే - జి.. మెలోడీ చాక్లెట్లు.. కిస్మి లాంటి ఫేమస్ బ్రాండ్లు ఈ సంస్థ సొంతం.
ఈ బ్రాండ్ల ద్వారా ఏటా వేలాది కోట్ల భారీ లాభాల్ని ఈ సంస్థ ఆర్జిస్తోంది. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సదరు సంస్థ కుటుంబానికి చెందిన వారే సమకూర్చటంతో బయట పెట్టుబడుల అవసరం దానికి లేదు. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే.. కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు బోర్డు అనుమతి అవసరం ఉంటుంది. అదే.. కుటుంబ వ్యాపారమైతే.. సదరు కుటుంబం ఏం డిసైడ్ చేస్తుందో అదే తుది నిర్ణయం అవుతుంది. ఒకసారి స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తే.. సెబీకి జవాబుదారిగా ఉండాలి. ప్రతి అంశం కొన్ని నియంత్రణల పరిధిలో ఉంటుంది. పార్లే సంస్థ చౌహాన్ కుటుంబానికి చెందిన మూడు భిన్నమైన గ్రూపుల ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. అన్ని నిర్ణయాలను చౌహాన్ కుటుంబమే తీసుకుంటుంది. వేరే వారి నిర్ణయాలతో వారికి పని లేదు. కంపెనీ భారీగా విస్తరించినా.. దాన్ని స్టాక్ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు చౌహాన్ కుటుంబానికి ఆసక్తి లేదని చెబుతారు.
కుటుంబ వ్యాపారంగా ఉన్న కారణంగా సంస్థకు చెందిన వ్యాపార రహస్యాలు బయటకు పొక్కనివ్వకుండా సాధ్యమవుతోంది. దీంతో.. వ్యాపార ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. పార్లే జి బిస్కెట్ విషయానికి వస్తే.. దశాబ్దాల తరబడి రూ.5కే లభించటం తెలిసిందే. చౌకధరలో.. రుచికరమైన బిస్కెట్ కు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. 'పార్లే ప్రొడక్ట్స్' సంస్థ కుటుంబ వ్యాపారం కావటంతో దీనికి సంబంధించిన అధికార మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువకు సంబంధించిన లెక్కలు లేవు. అయితే.. మార్కెట్ విశ్లేషకులు.. ప్రత్యర్థి సంస్థలైన బ్రిటానియా విలువ ఆధారంగా చూసినప్పుడు ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు రూ.90వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చన్నది ఒక అంచనా. కంపెనీ ఆదాయం దాదాపు 8.5% వృద్ధితో నమోదవుతున్నట్లు చెబుతుంటారు. ఇతర వనరులతో కలిపి ఈ సంస్థ ఆదాయం సుమారు రూ.16వేల కోట్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా.
ఇటీవల కాలంలో ఈ కంపెనీ లాభాలు భారీగా తగ్గాయని చెబుతున్నారు. దీనికి కారణం ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగటం.. ప్యాకేజింగ్ తో పాటు మార్కెట్ లోని తీవ్ర పోటీతో నికర లాభం మీద ప్రభావం పడినట్లుగా చెబుతారు. భారత బిస్కెట్ మార్కెట్ లో బ్రిటానియా మొదటి స్థానంలో ఉంటే.. పార్లే రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మోహన్ లాల్ చౌహాన్ అయితే ఆయన వారసుల చేతిలో ఇప్పుడీ కంపెనీ ఉంది. పార్లే సంస్థ ప్రధానంగా మూడు గ్రూపులుగా విస్తరించింది. అన్నింటిలోనూ మూడు కుటుంబాల వారికి సమాన వాటాలు ఉన్నాయి. వారసులైన మూడు కుటుంబాల వారు.. ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు.
ఇందులో విజయ్ కాంతిలాల్ చౌహాన్ గ్రూప్.. శరద్ చౌహాన్ గ్రూప్.. రాజ్ చౌహాన్ గ్రూప్. ప్రతి ఒక్కరికి 33.33 శాతం వాటా ఉంది.
చౌహాన్ కుటుంబం నిర్వహించే వ్యాపారాలకు సంబంధించి చూస్తే.. వారి మధ్య విభజన చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతుంది. మూడు విభాగాల్లో కంపెనీని నిర్వహిస్తుంటారు. అందులో మొదటిది.. ఇప్పుడు వీరి గురించి మాట్లాడేలా చేసిన మెలోడీ చాక్లెట్లు పార్లే ప్రొడక్ట్స్ విభాగంలోకి వస్తుంది. ఈ సంస్థ ద్వారానే హైడ్ అండ్ సీక్.. క్రాక్ జాక్ లాంటి బిస్కెట్లు ఉత్పత్తి చేస్తుంటారు. ఇది విజయ్ చౌహాన్ గ్రూప్ కిందకు వస్తుంది. రెండోది పార్లే ఆగ్రో. అప్పీ ఫిజ్.. లాంటి పానీయాల విభాగం. ఈ కంపెనీకి చెందినదే ఫేమస్ అయినా ఫ్రూటీ. దీన్ని ప్రకాష్ చౌహాన్ గ్రూప్ నిర్వహిస్తూ ఉంటుంది. మూడోది బిస్లేరి. దేశంలోని అత్యధికుల నమ్మకాన్ని సొంతం చేసుకున్న మినరల్ వాటర్ బ్రాండ్. దీన్ని రమేష్ చౌహాన్ గ్రూప్ నిర్వహిస్తూ ఉంటుంది. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని చూస్తే.. త్వరలో ఒక మెగా ఐపీఓకు వస్తారని చెబుతారు. అదెప్పుడు ఉంటుందన్నది మాత్రం స్పష్టత రావట్లేదు. తాజాగా మోడీ పుణ్యమా అని మెలోడీ చాక్లెట్ కారణంగా ఐపీఓకు వస్తే మాత్రం.. భారీ స్పందన ఉండే అవకాశం ఉంది.