కారును కిరాయికి తీసుకొని.. సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భార్య!
తెలంగాణలో తాజాగా చోటుచేసుకున్న ఓ దారుణం మరోసారి సంచలనం రేపుతోంది.;
తెలంగాణలో తాజాగా చోటుచేసుకున్న ఓ దారుణం మరోసారి సంచలనం రేపుతోంది. భర్తను బలికొల్పేందుకు సొంత తమ్ముడితో కలిసి భార్య చేసిన హత్యాయత్నం, చివరకు భయంకర హత్యగా మారింది. ఇది మామూలు రోడ్డు ప్రమాదం కాదని పోలీసులు తేల్చటంతో అసలైన నిజాలు బయటపడ్డాయి. మేఘాలయలో ఇటీవల జరిగిన దారుణం ఇంకా మరవకముందే, తెలంగాణలో ఇదే తరహా ఘటన కలకలం రేపుతోంది.
-క్రైం జరిగిందిలా..
యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడిని స్థానికులు స్వామిగా గుర్తించారు. మొదట ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. కానీ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
అనుమానాలు.. విచారణ మలుపు
స్వామి భార్య వ్యవహార శైలి పోలీసులకు అనుమానం కలిగించింది. దీంతో ఆమె ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించారు. విచారణలో ఆమె ఒకే నెంబర్‌కు గంటల తరబడి మాట్లాడినట్లు బయటపడింది. ఆ నెంబర్ స్వామి భార్య ప్రియుడిదని పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఆమె సోదరుడితో కూడా అదే సమయంలో ఎక్కువసేపు సంభాషించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
- హత్యకు ప్లాన్
స్వామికి భార్యకు ఓ వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. భర్తను అడ్డంకిగా భావించిన ఆమె, అతన్ని తొలగించాలని పక్కా ప్రణాళిక వేసింది. ఈ పన్నాగంలో ఆమె సోదరుడు కూడా పాలుపంచుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఒక కారును కిరాయికి తీసుకుని, స్వామి ఎప్పుడూ వెళ్లే ఆ రూట్లో వేచిచూశారు. అతను వస్తుండగానే కారును రాంగ్ రూట్లో, అత్యధిక వేగంతో నడిపి ద్విచక్ర వాహనంపై ఉన్న స్వామిని ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, పలుమార్లు కారును అతని మీద నడిపి అక్కడికక్కడే మృతి చెందేలా చేశారు.
దర్యాప్తులో ముగ్గురు అరెస్ట్
ఈ హత్యలో భార్యతోపాటు ఆమె తమ్ముడు, మరో ఇద్దరు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేయడం, ప్రియులతో కలిసి కుట్రలు పన్నడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ బంధాలు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. జీవితాలను చీల్చేసే విధంగా మారుతున్న వాస్తవం భయంకరం. మానవ సంబంధాలకు మర్యాద మిగలాలంటే.. శరీరానికి కాదు, మనసుకే ప్రేమ చెల్లాలి!