అమెరికాలో ఘోరం..పిజ్జా డెలివరీకి వెళ్లిన తెలంగాణ యువకుడిపై కాల్పులు!

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

Update: 2026-06-07 06:07 GMT

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్న ఒక తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణకు చెందిన 28 ఏళ్ల కుంచా అన్షుల్, అర్ధరాత్రి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కన్నవారికి అండగా ఉంటాడనుకున్న కొడుకు, పరాయి దేశంలో ఇలా శవమైపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎలా జరిగింది?:

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే ఖర్చుల కోసం ‘డోర్‌డాష్’ అనే సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల సమయంలో ఒక పిజ్జా ఆర్డర్ వచ్చింది. నార్త్ ఫిలడెల్ఫియాలోని ‘రేమండ్ రోసెన్ హోమ్స్’ హౌసింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి అన్షుల్ అక్కడికి వెళ్లాడు.

పక్కా ప్లాన్‌తోనే:

దుండగులు అన్షుల్‌ను టార్గెట్ చేసి పక్కా వ్యూహంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారు ఆర్డర్ ఇచ్చిన అడ్రస్ నిజానికి ఒక ఖాళీ ఇల్లు. అన్షుల్ అక్కడికి చేరుకుని, ఇంట్లోకి వెళ్లి మూడు పిజ్జా బాక్సులను అక్కడ పెట్టాడు. ఆర్డర్ డెలివరీ చేసి తిరిగి వస్తున్న సమయంలో, పొంచి ఉన్న దుండగులు చాలా దగ్గర నుండి అతని తలపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఇక తీవ్ర రక్తస్రావం కావడంతో అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సీసీటీవీ ఫుటేజ్ ఏం చెబుతోంది?:

సమాచారం తెలియగానే పోలీసులు ఆ స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఖాళీ ఇంటి లోపల తెరవని పిజ్జా బాక్స్‌లు, అన్షుల్ డెలివరీ బ్యాగ్ లభించాయి. అంటే డెలివరీ పూర్తయిన వెంటనే ఈ దాడి జరిగింది. ఇక అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అన్షుల్ ఆహారాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అతనిని వెంబడించినట్లు రికార్డ్ అయింది. వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు:

ఘటనా స్థలం నుండి బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను ట్రాక్ చేసేందుకు డిటెక్టివ్‌లు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.విచారణ జరుగుతుంది.

ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు ఇలా అకాల మరణం చెందడం అందరినీ కలచివేస్తోంది. ఈ వార్త విన్న అన్షుల్ స్నేహితులు, తెలంగాణలోని అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అలాగే పరాయి దేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక తెలుగు సంఘాలు కోరుతున్నాయి.


Tags:    

Similar News