తెలంగాణ‌లో గ‌తంలో ఏడు ఉప ఎన్నికలు.. అధికార పార్టీకేనా ప‌ట్టం..?

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డి దాదాపు ప‌ద‌కొండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది.;

Update: 2025-10-21 14:30 GMT

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డి దాదాపు ప‌ద‌కొండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. ఈ వ్య‌వ‌ధిలో అనుకోని కార‌ణాల‌తో మొత్తం ఏడుసార్లు ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఆరు ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. ఏడో, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాత్రం కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లో కొన‌సాగుతోంది. మ‌రి గ‌త ఏడు (ఉప) ఎన్నిక‌ల ఫ‌లితాలు ఓసారి చూద్దామా మ‌రి...?

ఖేడ్ నుంచి తొలి ఉప ఎన్నిక‌

తెలంగాణ ఏర్ప‌డిన ఏడాదికి... 2015 ఆగ‌స్టులో నారాయ‌ణ‌ఖేడ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కిష్టారెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌వ‌డంతో ఉప ఎన్నిక జ‌రిగింది. 2016 ప్రారంభంలో జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌లో సిటింగ్ సీటును కాంగ్రెస్ కోల్పోయింది. అప్ప‌టి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మ‌హారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పాలేరులో మ‌లి...

2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి సైతం హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీనికి కొంత‌కాలం క్రితంవర‌కు టీడీపీలో ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును బీఆర్ఎస్ త‌మ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది. అనూహ్యంగా పాలేరు సీటు ఖాళీ కావ‌డంతో తుమ్మ‌ల‌ను పోటీకి దింపింది. ఈ ఎన్నిక‌లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపొంది.. కాంగ్రెస్ సీటును త‌న ఖాతాలో వేసుకుంది.

దుబ్బాక‌లో దెబ్బ‌ప‌డింది..

బీఆర్ఎస్ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, 2020లో దుబ్బాక నుంచి గెలిచిన ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి అనారోగ్యంతో చ‌నిపోయారు. ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ ఆయ‌న భార్య‌ను నిలిపింది. కానీ, బీజేపీకి చెందిన ర‌ఘునంద‌న్ రావు విజ‌యం సాధించారు.

ఈట‌ల బ‌హిష్క‌ర‌ణ‌తో...

2021లో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న స‌మ‌యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో కుదుపు. బీఆర్ఎస్ లో నంబ‌ర్ 2గా ఉన్న ఈటల రాజేంద‌ర్ ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఆయ‌న బీఆర్ఎస్ కు దూర‌మ‌య్యారు. ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వ‌చ్చింది. ఇందులో బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఈట‌ల త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌ను నిల‌బెట్టుకున్నారు.

నాగార్జున సాగ‌ర్ లో గ‌ట్టెక్కిన బీఆర్ఎస్

2021లోనే న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో ఉప ఎన్నిక రాగా.. ఆయ‌న కుమారుడు భ‌గ‌త్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి దిగ్గ‌జ నాయ‌కుడు జానారెడ్డి పోటీ ప‌డినా.. భ‌గ‌త్ ఆయ‌న‌ను సులువుగా ఓడించారు.

మునుగోడులోనూ ప‌దివేల తేడాతో

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయ‌డంతో 2022లో మునుగోడులో ఉప ఎన్నిక వ‌చ్చింది. బీజేపీ నుంచి పోటీకి దిగిన రాజ‌గోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ త‌ర‌ఫున బ‌రిలో దిగిన కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ప‌రాజ‌యం పాల్జేశారు. ఇవ‌న్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉండ‌గా జ‌రిగిన అసెంబ్లీ ఉప ఎన్నిక‌లు.

-కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ 2023 ఎన్నిక‌ల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత (బీఆర్ఎస్) రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఉప ఎన్నిక‌ను 2024 లోక్ స‌భ ఎన్నిక‌లతో క‌లిపి నిర్వ‌హించారు. కాంగ్రెస్ నుంచి శ్రీగ‌ణేష్ నెగ్గారు.

-ఈ ఏడాది జూన్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య‌ మాగంటి సునీత‌, కాంగ్రెస్ త‌ర‌ఫున న‌వీన్ యాద‌వ్, బీజేపీ నుంచి లంకెల దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మొత్తం ఏడుసార్లు...

-తెలంగాణ వ‌చ్చాక మొత్తం ఏడుసార్లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. నాలుగుచోట్ల‌ (నారాయ‌ణ‌ఖేడ్, పాలేరు, నాగార్జున సాగ‌ర్, మునుగోడు) బీఆర్ఎస్ నెగ్గింది. వీటిలో సాగ‌త‌ర్ త‌ప్ప మూడు కాంగ్రెస్ నుంచి కైవ‌సం చేసుకున్నారు. రెండుచోట్ల బీజేపీ (దుబ్బాక‌, హుజూరాబాద్‌) నెగ్గాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సీట్లే.

కాంగ్రెస్ ఒక‌చోట (కంటోన్మెంట్) గెలుపొందింది. ఇది బీఆర్ఎస్ స్థానం.

2 ఎంపీ స్థానాల్లో...

2014లో మెద‌క్ ఎంపీ, గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్.. మెద‌క్ ఎంపీ సీటును ఖాళీ చేశారు. దీనికి ఆ ఏడాదే జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ త‌ర్వాత క‌డియం శ్రీహ‌రిని ఎమ్మెల్సీ చేయ‌డంతో ఆయ‌న వ‌రంగ‌ల్ ఎంపీ ప‌ద‌విని వదిలేశారు. 2015లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఈ స్థానాన్నీ బీఆర్ఎస్ నిల‌బెట్టుకుంది.

Tags:    

Similar News