అబ్బేబ్బే.. మేం పార్టీ ఎక్కడ మారాం? స్పీకర్ కు ఇచ్చే వివరణ ఇదేనట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు బరిలోకి దిగి.. విజయం సాధించిన కొందరు ఎమ్మెల్యేలు తర్వాతి కాలంలో అధికార కాంగ్రెస్ గూటికి చేరటం తెలిసిందే.;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు బరిలోకి దిగి.. విజయం సాధించిన కొందరు ఎమ్మెల్యేలు తర్వాతి కాలంలో అధికార కాంగ్రెస్ గూటికి చేరటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినాయకత్వం కోర్టును ఆశ్రయించటం.. పార్టీమారిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు సూచనలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై పలువురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. దీంతో.. సదరు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం.. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు తమదైన శైలిలో సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
పది మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్ఎస్ కోరుతోంది. అయితే.. స్పీకర్ ప్రసాద్ మాత్రం ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆలిండియా స్పీకర్ కాన్ఫరెన్సుకు పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ స్పీకర్ మంగళవారం తిరిగి రానున్నారు. దీంతో.. ఆ రోజున ఆయన తీసుకునే నిర్ణయం మంగళవారం తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు బుధవారం వినాయకచవితి కావటంతో.. పండుగ తర్వాతే నిర్ణయాన్ని తీసుకునే వీలుందని చెబుతున్నారు.
మరోవైపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు మాత్రం తమపై చర్యల కత్తి పడకుండా ఉండేందుకు వీలుగా తమ వాదనను వినిపిస్తారని చెబుతున్నారు. తాము పార్టీ మారలేదని.. ఇప్పటికి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నట్లుగా చెప్పటంతో పాటు.. అసెంబ్లీ రికార్డుల్లోనూ అలానే ఉందన్న టెక్నికల్ ఎవిడెన్సును ఇచ్చే వీలుందని చెబుతున్నారు. తమను బీఆర్ఎస్ ముఖ్యనేతలు కలుపుకుపోవటం లేదని.. తమ తప్పు ఏమీ లేదని వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశం ఉందంటున్నారు. వీరి వాదన ఇలా ఉంటే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం చెబుతారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఒక ఎత్తు. దానం నాగేందర్ వ్యవహారం మరో ఎత్తు. ఎందుకుంటే.. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇప్పటికి తాను అదే పార్టీలోనే ఉన్నానని చెబితే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఎలా పోటీ చేశారు? అన్నది ప్రధాన ప్రశ్నగా మారుతుంది. ఈ క్రమంలో స్పీకర్ కు ఇచ్చే సమాధానంలో ఏం చెబుతారు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.