అదిరే ఆలోచన.. ఆ పని చేస్తే అతి వేగానికి బ్రేకులు పడ్డట్లే

చేతిలో హైస్పీడ్ వాహనాలు.. తాము ప్రయాణిస్తున్న రోడ్డు సామర్థ్యం మీద అవగాహన లేకుండా పోతున్న వారి కారణంగా.. ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Update: 2026-06-03 05:00 GMT

రోడ్ల సామర్థ్యానికి మించిన వేగంతో దూసుకెళుతూ.. నిత్యం పలు ప్రమాదాలకు కారణం కావటమే కాదు.. తమ కోసం ఇళ్ల వద్ద ఎదురుచూస్తున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తూ.. ప్రాణాలు పోగొట్టుకునే వారెందరో. కాస్త నెమ్మదిగా వెళితే.. పోయేదేమీ లేదు. కానీ.. అలాంటిదేమీ పట్టకుండా వాయు వేగంతో తమ వాహనాల్ని దూసుకెళ్లేలా చేసే తీరు అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వాహనాలు సైతం అతి వేగానికి కారణమవుతున్నాయి. చేతిలో హైస్పీడ్ వాహనాలు.. తాము ప్రయాణిస్తున్న రోడ్డు సామర్థ్యం మీద అవగాహన లేకుండా పోతున్న వారి కారణంగా.. ప్రమాదాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రోడ్డు ప్రమాదాల్లో నూటికి తొంభై శాతానికి పైనే.. అతివేగం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించటం కోసం తెలంగాణలోని రేవంత్ సర్కార్ వినూత్నంగా ఆలోచిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో.. నుజ్జు నుజ్జు అయిన వాహనాలు.. దారుణంగా దెబ్బ తిన్న వాహనాల్ని విగ్రహాలుగా ఏర్పాటు చేయటమే కాదు.. సదరు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల ఫోటోలను సైతం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రమాదాలు జరిగిన చోట రోడ్డు ప్రమాదం ఫోటోలు.. అందులో ప్రాణాలు కోల్పోయిన వారి ఫోటోలను పెద్ద ఎత్తున పెట్టటం ద్వారా.. వాహనాల్ని అతివేగంతో నడిపే వారు.. తమ వాహన వేగాన్ని తగ్గిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము వెళ్లాల్సిన చోటుకు క్షేమంగా వెళ్లే వీలుందని..దీంతో రోడ్డు ప్రమాదాలు వీలైనంతగా తగ్గే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున 7,000 నుంచి 7,500 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. పోలీస్ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ఏటా హత్యల వల్ల జరిగే మరణాల కంటే.. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం, 2024లో 7,281 మంది ప్రాణాలు కోల్పోతే.. 2025లో సుమారు 6,000 నుంచి 7,000 వరకు మరణాలు నమోదయ్యాయి.

రోడ్డు ప్రమాదాల కారణంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న వైనం ఆందోళనకు గురి చేయటమే కాదు.. ఒకరు ప్రాణాలు కోల్పోతే.. నాలుగైదు కుటుంబాలు దారుణంగా ప్రభావితం అవుతాయి. ఇదంతా చూస్తే.. అతి వేగంతోనూ.. నిర్లక్ష్యంతోనూ వాహనాలు నడిపే వారు.. తమ తీరును మార్చుకుంటే ఎంతోమంది తమ విలువైన ప్రాణాల్నికాపాడుకునే వీలుందన్నది మర్చిపోకూడదు. అయితే. ఈ ఏడాది చేపట్టిన చర్యల కారణంగా.. రోడ్డు ప్రమాదాల కారణంగా చోటు చేసుకునే మరణాల సంఖ్యలో దాదాపు 15 శాతం తగ్గుదల నమోదైనట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News