రేషన్ కార్డులపై దాసోజు శ్రవణ్ vs పొన్నం ప్రభాకర్ ఘర్షణ
ఖైరతాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది;
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడిని రాజేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగారు.
ఖైరతాబాద్‌లో రేషన్ కార్డుల పంపిణీకి హాజరైన దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 22,399 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 1,959 మందికే కార్డులు మంజూరయ్యాయని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్ వంటి నియోజకవర్గాల్లో 5,000కు పైగా కార్డులు మంజూరయ్యాయని, ఖైరతాబాద్‌పై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని శ్రవణ్ మండిపడ్డారు. 2016 నుంచి 2023 మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 6.47 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు.
శ్రవణ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ హయాంలో ఎన్ని లక్షల రేషన్ కార్డులు తొలగించారో కూడా శ్రవణ్ చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో శ్రవణ్ తన సీటు నుంచి లేచి నిరసన తెలియజేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తిగా రాజకీయ వేదికగా మారిపోయింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో, రేషన్ కార్డుల విషయంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.