తెలంగాణ పంచాయతీ పోరు.. మూడు ప్రధాన పార్టీలు ఎలా ఫీల్ అవుతున్నాయో తెలుసా?
తెలంగాణలో పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.;
తెలంగాణలో పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నవంబరు 26 బుధవారమే షెడ్యూల్ విడుదల కావొచ్చని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని అంటున్నారు. డిసెంబరు 11, 15, 19న ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోందని కథనాలు వస్తున్నాయి. అయితే అధికారికంగా తేదీలను ఖరారు చేయాల్సివున్నప్పటికీ, వచ్చే నెలలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో ప్రధానపార్టీల్లో హడావుడి మొదలైంది.
గ్రామస్థాయిలో అంత్యంత కీలకమైన పంచాయతీలకు చాలా కాలంగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై నెలకొన్న వివాదాన్ని సాగ దీయకుండా యథావిధిగా ఎన్నికలు జరిపించాలని నిర్ణయించింది. ఇక ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా, గ్రామాల్లో పార్టీపరంగానే పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీల్లో పట్టు ఉంటేనే రాష్ట్రస్థాయిలో పార్టీలకు బలం పెరుగుతుందని అంటున్నారు. దీంతో గ్రామాల్లో పునాదులు గట్టి చేసుకోవడానికి మూడు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండనుందని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు గ్రామస్థాయిలో బలమైన కేడర్ ఉండటంతో చాలాచోట్ల ద్విముఖ పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికలతో తమకు ఓ తలనొప్పి తప్పుతుందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండేళ్లుగా పంచాయతీ, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్రస్థాయి ఒత్తిడి పెరిగిపోతోందని చెబుతున్నారు. ఏ చిన్న పని అయినా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సి వస్తోంది. ఫలితంగా పనిభారం పెరిగిపోతోందని, సమస్య పరిష్కారంలో జాప్యం జరిగితే అది తమపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు జరిపిస్తే.. తమ బాధ్యతలను కొన్ని అయినా సర్పంచులు, ఇతర నాయకులకు అప్పగించొచ్చని భావిస్తున్నారు. పదవుల్లో ఉన్న నేతల మాటకు అధికారుల వద్ద విలువ ఉంటుందని, అందుకే స్థానిక ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతలు ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ కూడా పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది. రెండేళ్లుగా విజయం రుచి కోసం తహతహలాడుతున్న గులాబీ దండు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రామస్థాయిలో తమ పట్టు నిరూపించుకుని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని ప్రణాళికలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా పార్టీ విస్తరణకు పంచాయతీలే పునాదులుగా పావులు కదుపుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం, గెలవడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు పార్టీల వారు ఎన్నికలకు సై అంటుండటంతో గ్రామస్థాయిలో హడావుడి కనిపిస్తోంది.