తెలంగాణలోనూ జిల్లాల పెంపు!
అయితే.. అప్పట్లో కొన్ని కొన్ని మండలాల్లో నిరసనలు వచ్చాయి. తమ ప్రాంతాలను కూడా విభజించి జిల్లాలకు కేంద్రాలుగా మార్చాలని కొందరు.. కాదు కొత్త జిల్లానే ఏర్పాటు చేయాలని మరికొందరు ఉద్యమించారు.;
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు మారనున్నాయా? మరికొన్ని జిల్లాలను అదనంగా జోడించనున్నారా? మొత్తంగా 38 జిల్లాల వరకు ఉండనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల తెలంగాణపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. గతంలో రాష్ట్ర విభజన తర్వాత.. 10 జిల్లాలు గా ఉన్న తెలంగాణను అప్పటి సీఎం కేసీఆర్.. రెండు దఫాలుగా విభజించి.. 33 జిల్లాలకు పెంచారు.
అయితే.. అప్పట్లో కొన్ని కొన్ని మండలాల్లో నిరసనలు వచ్చాయి. తమ ప్రాంతాలను కూడా విభజించి జిల్లాలకు కేంద్రాలుగా మార్చాలని కొందరు.. కాదు కొత్త జిల్లానే ఏర్పాటు చేయాలని మరికొందరు ఉద్యమించారు. కానీ, అప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి రావడంతో ఈ వ్యవహారాన్ని 33 జిల్లాలకు పరిమితం చేశారు. దీనిని కేంద్రం కూడా నోటిఫై చేసింది. అయితే.. తాజాగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సమయంలో నాటి డిమాండ్లనే ప్రజలు లేవనెత్తుతున్నారు.
తమ ప్రాంతాలను అశాస్త్రీయంగా విభజించారని మహబూబ్ నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్‌లోనూ ఈ తరహా డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో మంత్రులు తాజాగా జిల్లాల విభజన కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం రేవంత్ కు కూడా వివరించారు. ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రజల అభీష్టం మేరకు.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జిల్లాల విభజన కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేపట్టారని.. దీంతో అప్పట్లో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నుంచి ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుపై పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని.. ప్రస్తుతం ఉన్న జిల్లాలపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటారు.