'జల రగడ' స్టార్ట్: కేంద్రానికి తెలంగాణ ఘాటు లేఖ!
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరకముందే.. జల రగడ స్టార్టయిపోయింది.;
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరకముందే.. జల రగడ స్టార్టయిపోయింది. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారాన్ని ఎలిమినేట్ చేయాలని.. కేవలం జల కేటాయింపుల విషయాన్ని మాత్రమే చర్చించాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఘాటు లేఖ రాసింది. ''ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశం అజెండాలో బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని చేర్చవద్దు'' అని తేల్చి చెప్పింది.
ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. బనకచర్ల ప్రా జెక్టు అంశాన్ని అజెండాలో చేర్చరాదని.. అలా చేరిస్తే.. చర్చించేందుకు తాము సుముఖంగా లేమని.. రద్దు చేసుకునే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఇదేసమయంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించాలని కోరడం గమనార్హం. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు.. జాతీయ హోదా కల్పించాలని పేర్కొంది.
ముఖ్యమంత్రుల భేటీ తెలంగాణ కోరికలు ఇవీ..
+ ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలి. దీనికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలి.
+ ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలి. దీనికి తక్షణ ఆమోదం కూడా తెలపాలి.
+ వృథాగా పోతున్న 200 టీఎంసీల వరద జలాలను పరిరక్షించి.. సాగు, తాగునీటికి వాడుకునేలా కొత్త ప్రాజెక్టు నిర్మించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి కూడా కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరింది.
+ గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి వీల్లేదు. ఇదే జరిగితే.. సమావేశం అర్ధంతరంగా ముగుస్తుంది.