మేఘాలు నీటి బాంబులు వేస్తాయా? వర్ష బీభత్సానికి కారణమేంటి?
ఇప్పుడు ఇలా కుంభవృష్టి కురిస్తే వాగులు, వంకలు పొంగడమే కాదు ఏకంగా పట్టణాలు, నగరాలను ముంచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న ఈ వర్షాలకు కుంభవృష్టి అని చెప్పడంలేదు.;
వర్షా కాలంలో వర్షాలు కురవడం సాధారణం. ఒక్కోసారి ఆలస్యంగా ఒక్కోసారి సకాలంలో వర్షాలు పడతాయి. రుతు పవనాల గమనం ఆధారంగా ఈ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఇలా ప్రకృతిలో సంభవించే కొన్ని మార్పుల వల్ల కూడా వర్షాలు పడుతుంటాయి. ప్రకృతిలో చోటుచేసుకునే మార్పుల వల్ల కొన్ని సార్లు కుంభవృష్టి వర్షం పడుతుంది. రెండు మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసే భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు, వంకలు పొంగుతుంటాయి. కానీ, ఇప్పుడు ఇలా కుంభవృష్టి కురిస్తే వాగులు, వంకలు పొంగడమే కాదు ఏకంగా పట్టణాలు, నగరాలను ముంచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న ఈ వర్షాలకు కుంభవృష్టి అని చెప్పడంలేదు. ఈ అతిభారీ వర్షాలకు మేఘ విస్ఫోటనమని చెబుతున్నారు. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఈ విపత్తు ఇటీవల కాలంలో తరచూ సంభవిస్తోంది.
వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రంగా ఉంటుందని రెండు మూడు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటుంది. ప్రజలను అప్రమత్తం చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటనాలై పేలిపోతున్నాయి. గంట, అరగంట పాటు కురిసే వర్షానికే ప్రళయంగా మారుతుంది. ఇటీవల కాలంలో ఉత్తరభారత దేశంలో మేఘాల విస్ఫోటనంతో భారీ విపత్తులు సంభవిచ్చాయి. హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకేసారి వరదలు పోటెత్తాయి. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపత్తులు ఎవరూ చూడలేదు. పైగా పర్వత శాణువుల్లో ఇటువంటివి జరుగుతాయని టెక్నాలజీ కారణంగా ఇప్పుడు తెలుస్తుందని సరిపెట్టుకున్నారు. గత ఏడాది కూడా కేరళలో ఇలాంటి మేఘ విప్పోటనం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. కొండ చరియలు విరిగిపడి ప్రజలు సజీవ సమాధి అయ్యారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతం మేఘాలు గర్జిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు బుధవారం కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మేఘాలు బద్ధలై ఆకస్మిక వరదలు సంభవించాయి. కామారెడ్డి పట్టణంలో కొన్నిచోట్ల ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా భవనాలు తొలి అంతస్తు వరకు మునిగిపోయాయి. దీంతో మేఘ విస్ఫోటనంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత వారం కశ్మీరు లోయ ఇదే తరహాలో క్లౌడ్ బరస్ట్ తో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ తెలంగాణలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ, మేఘ విప్ఫోటనం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏకంగా 6 వేల మంది మరణించారు. వాతావరణశాఖ అంచనాకు దొరకకుండా కొద్ది ప్రాంతంలోనే కొద్ది సమయంలో ఉరుములు, మెరుపుల ఘర్షణల కారణంగా భయంకర కుండపోత వర్షంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అతికొద్ది ప్రాంతంలో అపారమైన కుండపోత వర్షం ఆకస్మికంగా కురవడాన్ని మేఘ విస్ఫోటనంగా అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెండు మేఘాలు ఢీకొట్టడం వల్ల గంట, అరగంటలోనే 10 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం నమోదు అవుతుంది. గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి, మేఘాలు అవక్షేపం చెంది కుండపోత వర్షానికి కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మేఘ విస్ఫోటనం ఆకస్మికంగా విధ్వంసంగా మారడం సర్వసాధారణంగా మారిపోయిందని అంటున్నారు. ఈ మేఘ విస్ఫోటనాలను వాతావరణశాఖ ముందస్తుగా గుర్తించడానికి అవకాశం లేనందున భారీగా ప్రాణ, ఆస్తినష్టాలు నమోదు అవుతున్నాయి.
ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం వల్ల తీవ్రమైన వరదలు వస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడి అపార నష్టాలను చవిచూడాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఎత్తైన పర్వాలు ఉన్నచోట కూడా క్లౌడ్ బరస్ట్ సంభవిస్తోంది. మేఘాలకు పర్వతాలు అడ్డుగా ఉండటం, వేడి తేమ కలిగిన గాలిపైకి ప్రయాణించడం, చల్లబడటం వల్ల వేగంగా వర్షాలు పడుతున్నాయని అంటున్నారు.