హోం మినిస్టర్ అజ్జూ.. సేమ్ బీఆర్ఎస్ స్ట్రాటజీనే?

ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీసిపోని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.;

Update: 2025-10-30 11:47 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అజెండాతో బరిలో దిగిన హస్తం నేతలు ఊహకందని ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో భారీగా ఉన్న మైనార్టీ ఓటర్లను బుట్టలో వేసుకునేలా పావులు కదుపుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీసిపోని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనితోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో 12 మందితో కలిపి అధికార పార్టీ బలం 80కి చేరింది. అయితే వీరిలో ఏ ఒక్కరూ మైనార్టీ వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఆ వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్ననాడే మైనార్టీల నుంచి ఎవరో ఒకరిని మంత్రిగా నియమిస్తారని భావించారు. కానీ, అప్పట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో సాధ్యపడలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా మైనార్టీ నేత మస్కతీని తీసుకోవాలని నిర్ణయించడంతో మంత్రిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీనియర్ నేత షబ్బీర్ అలీ సైతం రేసులోకి రావడంతో మైనార్టీ మంత్రి కోటా భర్తీ పెండింగులో పడిపోయింది.

కాంగ్రెస్ నుంచి మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీతోపాటు టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, నాంపల్లి నుంచి పోటీచేసిన మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ మధ్య పదవుల కోసం తీవ్ర పోటీ ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే తర్జనభర్జన మధ్యే రెండేళ్ల కాలం గడిచిపోయింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ముగ్గురిలో అజారుద్దీన్ కు లైన్ క్లియర్ అయింది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసిన అజారుద్దీన్ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే నియోజకవర్గానికి కొత్త కావడం, అప్పటికే టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారడంతో అజారుద్దీన్ ఓటమి చెందినట్లు విశ్లేషణలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన అజారుద్దీన్ ను కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. ప్రతిగా మంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీగా చేస్తామని హామీ ఇచ్చింది. మాట ఇచ్చినట్లే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగులో ఉండగా, శుక్రవారం ఆయనతో మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా, ఆగే పరిస్థితి లేదంటున్నారు.

దీంతో శుక్రవారం అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఆయనకు శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతోపాటు కొన్ని ఇతర కీలక శాఖలు అప్పగించే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో మైనార్టీ నేత మహమ్మద్ అలీ ఉప ముఖ్యమంత్రి హోదాలో హోంశాఖ బాధ్యతలు చూశారు. ఆయన కూడా పెద్దల సభ సభ్యుడుగానే ఎన్నికయ్యారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్నే అమలు చేసేలా కాంగ్రెస్ సర్కారు పావులు కదిపే అవకాశం ఉందని అంటున్నారు.

క్రికెట్ లో టీం ఇండియా కెప్టెన్ గా పనిచేసిన అజారుద్దీన్ కు ఇంగ్లీషు, హిందీలపై మంచి పట్టు ఉంది. దీంతో అఖిల భారత సర్వీసు అధికారులను ఆయన బాగా డీల్ చేసే సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే హోంశాఖ అప్పగిస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుల సలహాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖను కూడా అప్పగించాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా మంత్రివర్గంలో చేరనున్న అజ్జూ భాయ్ కి కీలక బాధ్యతలు ఇవ్వడం ఖాయమనే అంటున్నారు.

Tags:    

Similar News