అరవిందమా? రాజేంద్రమా? బీజేపీ తెలంగాణ కొత్త చీఫ్ ఎవరు?
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీగా చెప్పుకొంటున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది;
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రకారం తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం దగ్గరపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీగా చెప్పుకొంటున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 2023 ఎన్నికలకు ముందు మూడేళ్లు తెలంగాణ బీజేపీ బాస్‌గా ఉన్న ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఓ ఊపుతెచ్చారు. కానీ, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను తప్పించి.. సీనియర్ అయిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకుతగ్గట్లే బీజేపీకి తెలంగాణలో అసెంబ్లీకి సీట్లు తగ్గాయి. డబుల్ డిజిట్ సాధిస్తుందని అనుకున్న పార్టీ 8 సీట్లకు పరిమితం అయింది. అయితే, ఇది బలం పెరిగిన సంకేతమే కావడం గమనార్హం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా 8 స్థానాలను గెలుచుకుంది కాషాయ దళం.
ఇక ఇప్పుడు పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక చేపట్టాల్సిన సమయం వచ్చింది. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతల్లో ఉన్నందున అధ్యక్షుడిగా తప్పుకోవాలి. కానీ, పార్టీలో వర్గ విభేదాల కారణంగా కొత్త చీఫ్ ఎన్నిక లేదా నియామకం సాధ్యం కాలేదు. గతేడాది కొత్త అధ్యక్షుడు వస్తారని భావించినా ముందుకు కదల్లేదు. ఇప్పుడు మాత్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ కొత్త నాయకత్వంను ఎన్నుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా ఆదివారం హైదరాబాద్ వస్తున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రారంభించి బహిరంగసభలో పాల్గొంటారు. నిజామాబాద్ కంఠేశ్వర్ క్రాస్‌రోడ్డులో స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అయిన డీఎస్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. మరోవైపు సోమవారం నుంచి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. దీంతో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన కూడా పార్టీ నేతలతో సమావేశం అవుతారని.. అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆశావహులు షాను కలిసే అవకాశం ఉందని సమాచారం.
కాగా బీజేపీ అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. గత ఏడాది దాదాపు ఈటల పేరు ఖాయం అని ఊహాగానాలు వచ్చాయి. కానీ, అది ఆగిపోయింది. ఓ దశలో బండి సంజయ్‌కు మళ్లీ పగ్గాలు అని భావించారు. అదీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం సంజయ్ స్థానంలో అర్వింద్ పేరు వినిపిస్తోంది. 47 ఏళ్ల యువకుడు, పార్టీకి నిబద్ధుడు, మోదీకి వీరాభిమాని అయిన అర్వింద్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తండ్రిది కాంగ్రెస్ నేపథ్యం అయినా బీజేపీలో చేరి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇక ఈటల పీడీఎస్‌యూ నేపథ్యం నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌లో ప్రస్థానం ప్రారంభించారు. తెలంగాణలో దాదాపు ఏడేళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ పార్టీ అధినాయకత్వంతో విభేదాలు రావడంతో బహిష్కరణకు గురయ్యారు. 2021 ఉప ఎన్నికలో హుజూరాబాద్ నుంచి గెలిచినా 2023లో ఓడిపోయారు. 2024లో ఎంపీగా నెగ్గారు. మరిప్పుడు వీరిద్దరిలో ఎవరిని తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి వరిస్తుందో? చూడాలి.