కేసీఆర్, రేవంత్ షేక్ హ్యాండ్.. అసెంబ్లీలో ఇదే హైలెట్.. కానీ..
రాజకీయంగా వారిద్దరూ బద్దశత్రువులు.. గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్ సొంతం.;
రాజకీయంగా వారిద్దరూ బద్దశత్రువులు.. గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్ సొంతం. ఆ కసిమీదనే కేసీఆర్ ను ఓడించి సీఎం అయిన చరిత్ర రేవంత్ ది.. వీరిద్దరి వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అసెంబ్లీలో మాత్రం ఈ శషభిషలు , ప్రతీకారాలకు తావులేకుండా ఓ అరుదైన దృష్యం కనిపించింది. బయట విపరీతంగా తిట్టుకునే వీరిద్దరూ.. రేవంత్ చొరవతో ఈరోజు అసెంబ్లీలో షేక్ హ్యాండ్ ఇచ్చుకునే దాకా పరిస్థితి వెళ్లింది.
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఘటన చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దాదాపు రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కేసీఆర్ అసెంబ్లీలో తన సీట్లో కూర్చున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వద్దకు వెళ్లి పలకరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గౌరవ మర్యాదలతో కూడిన రాజకీయ పరిణితి
సాధారణంగా సభలో ముఖ్యమంత్రి సీటు వద్దకు వెళ్లి ఇతర నేతలు పలకరించడం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను పక్కన పెట్టి, నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు.కేసీఆర్‌కు ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు.రాజకీయ వైరం ఉన్నప్పటికీ, సభలో పాటించిన ఈ కనీస మర్యాద సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పట్టుమని పది నిమిషాలు కూడా ఉండని కేసీఆర్
కేసీఆర్ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తారా అని గత కొంతకాలంగా ప్రభుత్వం, ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు "కేసీఆర్ గారు సభకు రావాలి, తన అనుభవంతో మాకు సలహాలు ఇవ్వాలి" అని కోరుతూ వచ్చారు. నేడు సభకు వచ్చిన కేసీఆర్, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. అంటే కేవలం పది నిమిషాల లోపే ఆయన అసెంబ్లీ నుంచి నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరోగ్య కారణాల రీత్యా లేదా ఇతర కారణాల వల్ల ఆయన త్వరగా వెళ్ళిపోయారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
చట్టసభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు సహజం. కానీ వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా ఇలాంటి గౌరవపూర్వక వాతావరణం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి చూపిన ఈ చొరవ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుందేమో చూడాలి.