అచ్చెన్నకు ఎదురులేని టెక్కలి...వైసీపీ సంగతేంటి ?

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే 1994లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచారు.;

Update: 2026-04-14 06:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే 1994లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లోనే ఉమ్మడి ఏపీలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ మిత్ర పక్షాలతో కలిపి 265 దాకా సాధించి మొత్తం అసెంబ్లీని టీడీపీ మయం చేశారు. అలా టెక్కలి కూడా మారుమోగింది. అయితే ఎన్టీఆర్ తరువాత హిందూపురం సీటు ఉంచుకుని టెక్కలి వదిలేశారు. ఆ సీటు నుంచి హనుమంతు అప్పయ్య దొర టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా టీడీపీకి పట్టున్న సీటుగా మార్చేశారు.

సామాజిక సమీకరణలు :

అయితే టెక్కలిలో మొదటి నుంచి కాళింగుల ఆధిపత్యం ఉంటూ వస్తోంది. వారే ఎక్కువ సార్లు గెలుస్తూ వచ్చారు. కానీ 2009లో జరిగిన అసెంబ్లీ పునర్ విభజనలో టెక్కలి సీటు సామాజిక స్వరూపం మారింది. వెలమలకు ఆధిక్యం ఉన్న అతి పెద్ద మండలం సంతబొమ్మాళి ఇక్కడ కలిసింది. అదే సమయంలో హరిశ్చంద్రాపురం సీటు అదృశ్యం అయింది. దాంతో అచ్చెన్నాయుడు టెక్కలి షిఫ్ట్ అయ్యారు. కానీ 2009లో ఆయన పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. కానీ 2014 నుంచి వరుసగా మూడు సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా నిలిచారు. చిత్రమేంటి అంటే 2019లో జగన్ ప్రభంజనం లో కూడా ఆయన గెలిచి సత్తా చాటారు.

అనైక్యత కారణం :

ఇక టెక్కలిని అచ్చెన్న తన కంచుకోటగా మార్చుకుంటూ వచ్చారు మరో వైపు వైసీపీ ఇప్పటిదాకా ఈ సీటు విషయంలో ఆశలు పెట్టుకుంది కానీ సాధించింది లేదు. దానికి కారణం పార్టీలో వర్గ పోరు, సరైన నాయకత్వాన్ని ఫోకస్ చేయలేకపోవడం వంటివి. టెక్కలిలో నిజానికి మెజారిటీ మండలాలలో కాళింగులు ఉన్నారు. కానీ అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం మాత్రం వైసీపీలో లేదు, 2014 లో దువ్వాడ శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చారు. అదే పార్టీలో ఉన్న పేరాడ తిలక్ ఆయనకు సహకరించలేదని చెబుతారు. 2019లో పేరాడ తిలక్ కి సీటు ఇస్తే దువ్వాడ వర్గం వ్యతిరేకంగా చేసింది అంటారు. 2024 నాటికి దువ్వాడకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పేరాడ తిలక్ తో జత కలవలేదు. ఇలా వర్గ పోరు సాగుతుండగానే దువ్వాడ వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ప్రభావం గట్టిగానే :

టెక్కలిలో దువ్వాడ తానుగా గెలవకపోవచ్చు. కానీ ఓడించేటంత బలం బలగం ఆయనకు ఉన్నాయి. దాంతో పాటు ఆయనను వైసీపీలోకి తీసుకోవడం లేదు, దూరంగా పెట్టారు ఈ కారణంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగితే అది వైసీపీ ఓట్లనే చీలుస్తుంది అని అంటున్నారు. దాంతో మరోసారి అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి సులువుగా గెలిచేందుకు వీలు పడుతుందని అంటున్నారు. దువ్వాడ వైసీపీలో ఉన్నపుడు పార్టీకి బలంగా కనిపించినా గెలుపు బాట పట్టలేదు, కానీ ఆయన ఇపుడు పార్టీలో లేరు అనుకుంటే తప్పే అని ఆయనకు పడే ప్రతీ ఓటూ వైసీపీదే అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలే రేపటి రోజున వైసీపీకి ఇబ్బందిగా మారబోతున్నారు. మొత్తానికి వైసీపీకి టెక్కలి లెక్కలు తేల్చడం చాలా కష్టంగా మారుతోంది. సో అచ్చెన్నాయుడు ఎప్పటికీ హ్యాపీగా ఉండొచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News