తెలంగాణపై విషం : తేజస్వీ సూర్యపై కేటీఆర్, కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం ఒక భౌగోళిక విభజన కాదు.. అది ఆరు దశాబ్దాల ఆకాంక్ష.. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం.;
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం ఒక భౌగోళిక విభజన కాదు.. అది ఆరు దశాబ్దాల ఆకాంక్ష.. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. అటువంటి చారిత్రక ఉద్యమాన్ని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఉద్దేశించి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం కేవలం రాజకీయ అజ్ఞానం మాత్రమే కాదు.. తెలంగాణ అస్తిత్వంపై చేస్తున్న తీవ్రమైన దాడి.
చరిత్రను వక్రీకరించే ప్రయత్నం
భారత్-పాకిస్థాన్ విభజన అనేది రక్తపాతం, అల్లర్లు, కోట్లాది మంది నిర్వాసితులైన ఒక విషాదకర ఘట్టం. కానీ తెలంగాణ ఉద్యమం ముమ్మాటికీ ప్రజాస్వామ్యయుతమైనది. సత్యాగ్రహాలు, శాంతియుత నిరసనలు, సకల జనుల సమ్మె వంటి పద్ధతులతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఉద్యమం ఇది. అటువంటి పవిత్రమైన పోరాటాన్ని మతపరమైన విభజనతో లేదా దేశాల విచ్ఛిన్నంతో పోల్చడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మను గాయపరచడమే. పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి వ్యాఖ్యలు రావడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు.
రాజకీయ వైరం.. రాష్ట్రంపై విషమా?
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కానీ ఆ వైరం రాష్ట్ర అస్తిత్వాన్ని కించపరిచే స్థాయికి వెళ్లకూడదు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, కవిత ప్రశ్నించినట్లుగా.. తెలంగాణ ఏర్పాటును అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అవమానించడమే. గతంలో ప్రధాని మోదీ సైతం "తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు" అని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు మరో బీజేపీ నేత అంతకంటే ప్రమాదకరమైన పోలికను తీసుకురావడం ఆ పార్టీకి తెలంగాణపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది.
మౌనం అర్థమేమిటి?
తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అదే సభలో ఉన్న తెలంగాణకు చెందిన ఇతర పార్టీల ఎంపీలు మౌనంగా ఉండటం విచారకరం. పార్టీ జెండాలు ఏవైనా కావచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ప్రజాప్రతినిధులు గొంతు ఎత్తాల్సిన బాధ్యత ఉంది. సొంత రాష్ట్రం గురించి అవాకులు చవాకులు పేలుతుంటే మౌనం వహించడం అంటే ఆ వ్యాఖ్యలను పరోక్షంగా అంగీకరించినట్లే అవుతుంది.
తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇది పోరాడి సాధించుకున్న గడ్డ. రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించడం, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఏ పార్టీకైనా క్షేమకరం కాదు. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.. తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఒక రాష్ట్రాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అస్తిత్వంపై దాడి జరిగినప్పుడు తెలంగాణ సమాజం మళ్ళీ ఒక్కటవుతుందని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి.