కూతురిపై నిఘా.. నెలకు 65,000 ఖర్చు పెడుతున్న పేరెంట్స్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

అహ్మదాబాద్‌లో ఫోన్ పిచ్చితో కన్నవారిపైనే దాడికి తెగబడుతున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని అదుపు చేయడానికి తల్లిదండ్రులు నలుగురు బౌన్సర్లను కాపలా పెట్టారు.;

Update: 2026-05-06 09:15 GMT

అహ్మదాబాద్‌లో ఫోన్ పిచ్చితో కన్నవారిపైనే దాడికి తెగబడుతున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని అదుపు చేయడానికి తల్లిదండ్రులు నలుగురు బౌన్సర్లను కాపలా పెట్టారు. నెలకు 65 వేల రూపాయలు ఖర్చు చేస్తూ పెడుతున్న ఈ నిఘా వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. అది కేవలం ఆ అమ్మాయిని ఆపడానికి మాత్రమే కాదు, ఆమెను ఆ డిజిటల్ వ్యసనం నుండి కాపాడుకోవడానికి పేరెంట్స్ పడుతున్న ఆవేదన. నేటి యువత ఎందుకు ఇలా మారుతున్నారు? అసలు దీనికి పరిష్కారం ఏంటి అన్నది తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..

బౌన్సర్ల కాపలాలో టీనేజర్:

అహ్మదాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియాకు ఎంతలా బానిసయ్యిందంటే, ఫోన్ చేతిలో లేకపోతే హింసాత్మకంగా ప్రవర్తిస్తోంది. ఇక పిల్లకు ఏమి చెప్పిన మారకపోవడం, కన్న తల్లిదండ్రులనే కొడుతుండటంతో, చేసేదేమీ లేక వారు షిఫ్టుల వారీగా బౌన్సర్లను నియమించారు. కేవలం ఫోన్ వాడకుండా అడ్డుకోవడమే వీరి పని. ఇది వినడానికి వింతగా ఉన్నా, ఒక బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయం ఇది.

యువత ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?:

నేటి యువత ఫోన్‌కు ఇంతలా బానిస కావడానికి ప్రధాన కారణం వాళ్ళ మానసిక స్థితి. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు మెదడులో ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఇది ఒక వ్యసనం లాంటిది. సాధారణంగా ఆన్లైన్ లో ఇచ్చే గుర్తింపు నిజ జీవితంలో దొరకకపోవడం, ఒంటరితనం, మరియు తోటివారితో పోల్చుకోవడం వల్ల యువత ఫోన్‌నే లోకంగా మార్చుకుంటున్నారు.

అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది?:

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడవకుండా ఉండటానికో, లేదా తమ పనికి ఆటంకం కలగకుండా ఉండటానికో, అన్నం తినటానికో, చిన్నప్పుడే చేతికి ఫోన్ అలవాటు చేస్తున్నారు. అది మెల్లగా అలవాటుగా మారి, టీనేజ్ వచ్చేసరికి ఒక వ్యసనంలా మారుతోంది. ఇప్పుడు పిల్లలు బయట ఆడుకోవడం కంటే, స్క్రీన్ మీద బొమ్మలు చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు.ఇది మొదట్లో పేరెంట్స్ అలవాటు చేసిందే.

తల్లిదండ్రులు ఏం చేయాలి?:

ఇక పిల్లలను అదుపు చేయడానికి బౌన్సర్ల కంటే చిన్నప్పటి నుండి వారితో బాండింగ్ ముఖ్యం. ఇంకో ముఖ్యమైన పని మొదట తల్లిదండ్రులు తమ ఫోన్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండటం . వారితో కలిసి క్వాలిటీ టైమ్ గడపాలి. ఫోన్ వాడకానికి కొన్ని సమయాలను కేటాయించాలి. ఇక పిల్లలకు ఇతర పనులు ,అలవాట్లు అంటే ఆటలు, పెయింటింగ్, పుస్తక పఠనం వంటివి అలవాటు చేయాలి.

పూర్తిగా మార్చడం ఎలా?:

ఫోన్ అడిక్షన్ నుండి బయట పడేయడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి, వారి సమస్యలను వినాలి. ప్రవర్తన మరీ ఇబ్బందికరంగా ఉంటే సంకోచించకుండా ప్రొఫెషనల్ కౌన్సెలర్ లేదా సైకాలజిస్ట్ సలహా తీసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ పద్ధతులను పాటించడం వల్ల వారిలో నెమ్మదిగా మార్పు వస్తుంది.

టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచాలి కానీ, మనల్ని బానిసలుగా మార్చకూడదు అన్నది గుర్తుంచుకోవాలి. అహ్మదాబాద్ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. చిన్నప్పుడే పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు, దాని వల్ల కలిగే లాభనష్టాలను గమనించాలి. ఇంట్లో ప్రేమ, పలకరింపు ఉంటే వాళ్లకు ఫోన్ తీసుకొనే అలవాటు తగ్గుతుంది అన్నది నిపుణుల మాట.

Tags:    

Similar News