తమ్ముళ్ళు రాజీనామాలు చేస్తున్నారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు మండిపోతున్నారు

Update: 2024-03-08 04:34 GMT

రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తమ్ముళ్ళు మూకుమ్మడి రాజీనామాలు చేస్తన్నట్లు సమాచారం. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడినుండి జనసేన పోటీచేస్తుందని పార్టీ పెద్దలు స్పష్టంచేయటమే. పిఠాపురం నుండి పోటీచేయటానికి మాజీ ఎంఎల్ఏ వర్మ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. గడచిన ఐదేళ్ళుగా వర్మ నియోజకవర్గమంతా బాగా తిరుగుతున్నారు. నియోజకవర్గంపై వర్మకు బాగా పట్టుంది. ఇక్కడినుండి వర్మమూడుసార్లు పోటీచేసి ఒకసారి గెలిచారు.

విచిత్రం ఏమిటంటే టీడీపీ తరపున పోటీచేసిన రెండుసార్లు ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసినపుడు గెలిచారు. అంటే ఇక్కడ పార్టీకి మైనస్, వర్మకు ప్లస్ అన్న విషయం అర్ధమవుతోంది. అయితే రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా పోటీచేసి గెలవాలని వర్మ పట్టుదలగా పనిచేసుకుంటున్నారు. అయితే జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటులో ఈ సీటు జనసేన ఖాతాలోకి వెళ్ళినట్లు వర్మకు స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పారట. దాంతో మండిపోయిన వర్మ ఏమి మాట్లాడకుండా నియోజకవర్గంలోని మద్దతుదారులతో మీటింగు పెట్టుకున్నారు. ఆ మీటింగులో వర్మ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తాను ఇండిపెండెంటుగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.

Read more!

వెంటనే వర్మకు మద్దతుగా నేతలంతా తీర్మానంచేశారు. వర్మవెంటనే తాము నడుస్తామని తమ్ముళ్ళు ప్రకటించారు. అందుకు వీలుగా పార్టీకి, పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. జనసేన తరపున అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే పవన్ పేరు ప్రస్తావించకుండా జనసేన గెలుపుకు సహకరించాలని వర్మకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారట. అందుకు వర్మ అంగీకరించలేదని సమాచారం.

తాను కచ్చితంగా పోటీలో ఉంటానని అచ్చెన్నకు తేల్చిచెప్పారట. పవన్ లాంటి నాన్ లోకల్స్ కు ప్రజలు ఓట్లేయరని, అందరు తననే పోటీచేయమని అడుగుతున్నారని అచ్చెన్నకు వర్మ స్పష్టంగా చెప్పారట. దాంతో పిఠాపురం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో అచ్చెన్నకు అర్ధంకావటంలేదు. బీజేపీతో చర్చలకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు తిరిగిరాగానే వర్మను పిలిపించి మాట్లాడించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్మ పోటీలో ఉంటే పవన్ గెలుపు కష్టమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News