ఇంటింటికి టీడీపీ, వైసీపీ.. ఎక్కడ ఏం జరుగుతోంది?

టీడీపీ చేపట్టిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు.;

Update: 2025-07-03 11:30 GMT
ఇంటింటికి టీడీపీ, వైసీపీ.. ఎక్కడ ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజల బాట పట్టాయి. ఎన్నికలు జరిగి ఏడాది కావడంతో ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో విపక్ష వైసీపీ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఆయా పార్టీలు ఇంటింటికి వెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. ఏడాది విజయాలు చెప్పుకోవాలని టీడీపీ.. ఈ ఏడాదిలో హామీలు అమలు చేయలేదని వైసీపీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. సుమారు నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలి మూడు రోజులు ఎలా జరిగింది? అన్న విషయమై ప్రజలు ఆరా తీస్తున్నారు.

టీడీపీ చేపట్టిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నారా లోకేశ్ తన నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిలో పర్యటించారు. అదేవిధంగా క్యాబినెట్ లో ఉన్న టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ కార్యక్రమాన్ని 2వ తేదీన ప్రారంభించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన కొందరు ఎమ్మెల్యేలు తమ పర్యటనను రద్దు చేసుకుని నియోజకవర్గాలకు వచ్చి, ‘తొలి అడుగు’ నిర్వహించారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతోపాటు పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి, అభివృద్ధి పనులను వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రాత్రి 11 గంటల వరకు పర్యటించారు. అదేవిధంగా మంత్రి లోకేశ్ తాడేపల్లిలోని మహానాడు కాలనీలో ఇంటింటికి వెళ్లారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళలు, పిల్లలు పోటీ పడ్డారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన ఎక్కడ కూడా ‘తొలి అడుగు’ కార్యక్రమంలో కనిపించలేదు. ఈ కార్యక్రమం పూర్తిగా టీడీపీ ఆధ్వర్యంలోనే జరుగుతుండటంతో అధికార వర్గాలు కూడా హాజరుకాలేదు.

ఇదే సమయంలో ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత నెల నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కింద వైసీపీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వివరించాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను రూపొందించి వైసీపీ శ్రేణులకు అందజేశారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు వస్తాయని, ప్రజలు ఏ విధంగా మోసపోయారో గుర్తు చేయొచ్చని తెలిపారు.

ఐదు దశల్లో ఈ కార్యక్రమం నిర్వహించాల్సివుండగా, అధినేత జగన్ చెప్పినట్లు గ్రామస్థాయిలో ఎక్కడా ఈ కార్యక్రమం ప్రారంభించిన సూచనలు కనిపించలేదు. అధినేత జగన్ సైతం బుధవారం రోజంతా తాడేపల్లిలోని తన నివాసంలోనే గడిపారు. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వైసీపీ ప్రకటించలేదు. అయితే ఇదే సమయంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు కన్నా ముందే ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల హామీలు గుర్తుచేయాలన్న అధినేత జగన్ ఆదేశాలు మాత్రం ఇంకా అమలు కాలేదు. అయితే కార్యక్రమ నిర్వహణకు నెల రోజుల వ్యవధి విధించడమే వైసీపీ శ్రేణులు ఇంకా కదలలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News