పార్లమెంట్ లో ఏపీ లిక్కర్ స్కాం ప్రకంపనలు ?
దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉన్న లిక్కర్ స్కాం మీద చర్చ జరిగేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది.;
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి మొదలు కాబోతున్నాయి. దాదాపుగా నెల రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశంలో టీడీపీ ఒక కీలక అంశాన్ని లేవనెత్తింది.
లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్న నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఏపీ లిక్కర్ స్కామ్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం మామూలిది కాదని అన్నారు. ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే లిక్కర్ స్కాం చోటు చేసుకుందని ఆయన చెప్పారు.
ఇది చాలా ముఖ్యమైన అంశమని ఆయన అఖిలపక్షంలో గుర్తు చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద అనుమతిస్తుందా అన్న చర్చ సాగుతోంది. కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఏపీలో కూడా ఎన్డీయే సర్కార్ ఉంది. ఇక లిక్కర్ స్కాం విషయంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిందని గుర్తు చేస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఉన్న లిక్కర్ స్కాం మీద చర్చ జరిగేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది. కచ్చితంగా ఈ అంశం మీద చర్చకు అవకాశం దక్కవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే కనుక ఏపీకి సంబంధించి వైసీపీని జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయినట్లే అంటోంది.
అయితే లిక్కర్ స్కాం ఏదీ జరగలేదని ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమని కక్ష సాధింపు చర్యలలో భాగమని వైసీపీ అంటోంది. అయితే అఖిల పక్ష సమావేశానికి వైసీపీకి చెందిన ఎంపీ పిల్లు సుభాష్ చంద్రబోస్ లోక్ సభ ఎంపీలు గురుమూర్తి తనూజా హాజరయ్యారు.
టీడీపీ ఈ అంశం మీద డిమాండ్ చేసింది. వైసీపీ నుంచి ఏ రకమైన స్పందన వచ్చిందో తెలియడం లేదు. అయితే పార్లమెంట్ లో చర్చను వైసీపీ కూడా కోరుకుంటోందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. తాము ఏ తప్పూ చేయలేఅదని దానినే వివరిస్తామని వైసీపీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. మొత్తాం మీద ఏపీలో కాక పుట్టిస్తున్న లిక్కర్ స్కాం వ్యవహారం పార్లమెంట్ లో కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందా అంటే చూడాల్సిందే.
ఇక ఈసారి లోక్ సభలో చర్చించాల్సిన మరి కొన్ని అంశాలను టీడీపీ కేంద్రం ముందు ఉంచింది. ఏపీలో పంటలకు మద్దతు ధర లభించడం లేదని దాని మీద కూడా చర్చించడానికి చూస్తోంది. అలాగే నదుల అనుసంధానంపైనా చర్చించాలని కృష్ణదేవరాయలు కోరారు. ఇక జలజీవన్ మిషన్‌పై చర్చించాలని ఆయన టీడీపీ తరఫున అజెండాను అఖిలపక్షంలో వెలువరించారు.