ఆ ఎమ్మెల్యేలపై డేగ కన్ను.. టీడీపీ కీలక నిర్ణయం ..!
ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలపై టీడీపీ దృష్టి పెట్టింది. సదరు నేతలు ఏం చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అనే విషయాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.;
ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలపై టీడీపీ దృష్టి పెట్టింది. సదరు నేతలు ఏం చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అనే విషయాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అంతేకాదు.. జిల్లా ఇంచార్జ్‌లు, నియోజకవర్గ బాధ్యులకు, ఇంచార్జ్ మంత్రులకు కూడా కొన్ని కొన్ని బాధ్య తలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కృష్ణా సహా పలుజిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సదరు ఎమ్మెల్యేలపై డేగకన్ను సారించారని తెలిసింది.
ఎందుకు?
ప్రధానంగా 4 విషయాలకు సంబంధించి టీడీపీ నేతలపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఆయా విష యాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. నాయకులు తమను తాము సరిదిద్దు కోవాలని కూడా చెబుతున్నారు. అయితే.. ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు..తమను తాము నియంత్రించుకునే విష యంలోను, తమను తాము సరిదిద్దుకునే విషయంలోనూ ఎక్కడా ముందుకు రావడం లేదు. దీంతో ఆయా ఎమ్మెల్యేల విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఇవీ అంశాలు..
1) ప్రజల మధ్య లేకపోవడం: ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రజాదర్బార్‌లు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది ఆ పనిచేయడం లేదు.
2) 1వ తారీకు ఇచ్చే పింఛను కార్యక్రమం: ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. కొందరు ఎమ్మెల్యేలు పెద్దగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. ఫలి తంగా సచివాలయ సిబ్బందిమాత్రమే ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలతో కనెక్ట్ కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
3) స్థానికంగా లేకపోవడం: కొందరు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉండడం లేదు. ఈ విష యాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల కూడా చెప్పారు. నియోజకవర్గాలను వదిలేసి.. హైదరాబాద్‌లో తిష్ఠ వేస్తున్నారని.. ఇది సరైన విధానం కాదని ఆయన హెచ్చరించారు.
4) వ్యాపారాలు: కొందరు ఎమ్మెల్యేలు.. వ్యాపారాలు, వ్యవహారాల్లోనే తీరిక లేకుండా ఉంటున్నారు. ఇలా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం పార్టీ విధానాలకు.. అధిష్టానం సూచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నవారిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టనుంది.