జిల్లాల్లో జోష్ నింపిన ప‌సుపు పండుగ‌!

తెలుగుదేశం పార్టీ రెండు రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు జిల్లాల స్థాయిలో మంచి రిజల్ట్ తీసుకువచ్చింది.

Update: 2026-05-29 12:32 GMT

తెలుగుదేశం పార్టీ రెండు రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు జిల్లాల స్థాయిలో మంచి రిజల్ట్ తీసుకువచ్చింది. వాస్తవానికి ఈసారి ఆన్లైన్ వేదికగా నిర్వహించిన మహానాడు కావడంతో జిల్లా స్థాయిలో పెద్దగా ప్రభావం చూపించదని అనుకున్నారు. కానీ, ముందు నుంచి పటిష్టమైన వ్యూహంతో పాటు పటిష్టమైన కార్యాచరణను అనుసరించడంతో ఆన్లైన్ మాధ్యమంగా జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో మహానాడు విజయవంతం అయింది.

ఇది అన్ని జిల్లాల్లోనూ సక్సెస్‌గా నిర్వహించడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పటివరకు జిల్లాల స్థాయిలో నాయకుల మధ్య ఉన్న స్వల్ప విభేదాలు వివాదాలు, కొంతమేరకు తగ్గాయి అని చెప్పాలి. నిన్న మొన్నటివరకు కొంత విభేదాలు, వివాదాలతో కొనసాగిన నాయకులు కూడా మహానాడు వేదికగా చేతులు కలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తరలించడం దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన తీర్మానాలను ఆమోదించే వరకు కూడా కలిసి పనిచేశారు.

ఇది జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం కల్పించినట్టు అయింది. అంతేకాదు నాయకుల మధ్య ఐక్యత కూడా కనిపించింది. అనంతపురం నుంచి చిత్తూరు వరకు, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ మహానాడు జోష్ బాగా కనిపించింది. నాయకులు కలిసికట్టుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముఖ్యంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నికైన తర్వాత నిర్వహించిన తొలి మహానాడు కావడంతో ప్రతి ఒక్కరూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

పైగా `మై టిడిపి యాప్ `లో దీనిని క్యాప్చర్ చేయడం ద్వారా ఎవరెవరు వచ్చారు? ఎవరు రాలేదు? అనే విషయాలను పార్టీ నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఇది కూడా నాయకుల మధ్య సఖ్యతను పెంచేందుకు కారణమైంది. జిల్లాలో నాయకులు కలిసికట్టుగా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడేలా చేసింది. తద్వారా క్షేత్రస్థాయిలో మహానాడు మంచి ఫలితాన్ని ఇచ్చిందన్న నివేదికలు వస్తున్నాయి.

Tags:    

Similar News