మహానాడుకు కౌంట్ డౌన్.. గ్రౌండ్ లెవిల్లో ఏం జరుగుతోంది.. ?
టీడీపీ ఘనంగా నిర్వహించే మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు.;
టీడీపీ ఘనంగా నిర్వహించే మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు. దీనికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు.. తొలిసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్న నేప థ్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది వరకు పార్టీ కార్యకర్తలను సమీకరించే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే.. దీనికి ముందు సన్నాహక కార్యక్రమం చేపట్టారు. అదే `మినీ మహానాడు`. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించడం.. మహానాడు లక్ష్యాలను వెల్లడించడం.. నాయకులకు దిశానిర్దేశం చేయడం అనేవి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఈ నెల 23 వరకు ఈ కార్యక్రమాలు చేపట్టాలని హైకమాండ్ ఆదేశించింది. మరి ఇవి జరిగాయా? అంటే.. జరిగాయి.
కానీ, కొన్ని చోట్ల మాత్రమే జరిగాయి. కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. విజయవాడలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం జరగలేదు. అనంతపురంలోని ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే జరిగినా.. అక్కడ కూడా వివాదాలు విమర్శలతోనే తమ్ముళ్లు వాదులాటలకు దిగారు. ఓ నాయకుడు తనకు గుర్తింపు లేదని పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాప్రయత్నం చేయడం మరో కీలక అంశం. ఇక, మినీ మహానాడుల ఉద్దేశం ఒకటైతే.. నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాలు చర్చించమని కోరుతుంటే.. పార్టీని మరింత బలోపేతం చేయడం.. ఓటు బ్యాంకును పెంచడంపై దృష్టి పెట్టమంటే.. వ్యక్తిగత సమస్యలను ఈ సమావేశాల్లో జొప్పించి.. పార్టీని డైల్యూట్ చేసే ప్రక్రియకు నాయకులు శ్రీకారం చుట్టారు. తద్వారా.. మినీ మహానాడుల ఉద్దేశం మారిపోయింది. తద్వారా.. నాయకుల అక్కసు బయట పడుతోందే తప్ప.. లక్ష్యం చేరువ కావడం లేదన్నది వాస్తవం. జగ్గంపేటలో జరిగిన మినీ మహానాడు దీనికి అద్దం పడుతోంది. మరి అసలు మహానాడుకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్ననేపథ్యంలో ఏం చేస్తారోచూడాలి.