డిప్యూటీ స్పీకర్‌పై పోరు.. నేటి నుంచే ఆమరణ నిరాహార దీక్ష!
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీ కార్యకర్త వెంకటేశ్వరరాజు శనివారం ఆమరణ నిరాహారదీక్షకు దిగడం సంచలనంగా మారింది.;
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు సొంత నియోజకవర్గంలో మరో షాక్ తగిలింది. రఘురామ సొంత నియోజకవర్గంలోని ఉండి మండలం వెలిపర్రు గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. రఘురామరాజు వేధింపులు భరించలేక తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే, తన ఇళ్లు, కార్యాలయాన్ని కూల్చేసి పెద్ద బహుమానం ఇచ్చారని బాధితుడు వెంకటేశ్వరరాజు ఆరోపించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీ కార్యకర్త వెంకటేశ్వరరాజు శనివారం ఆమరణ నిరాహారదీక్షకు దిగడం సంచలనంగా మారింది. రఘురామ తీరుపై అసంతృప్తితో ఉన్న వెంకటేశ్వరరాజు గత 15 రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యాడు. రఘురామపై విమర్శలు చేసినందుకు గత శనివారం వెంకటేశ్వరరాజు ఇళ్లు, కార్యాలయాన్ని కూల్చేశారు. దీనికి నిరసనగా ఆయన శనివారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. తనకు న్యాయం చేసేంతవరకు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించాడు.
వెంకటేశ్వరరాజుకు చెందిన భవనాలను కూల్చేసిన చోటే ఆయన నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. చేతిలో పసుపు జెండా పట్టుకుని, మరికొన్ని జెండాలను శిథిలాలపై ఉంచి వెంకటేశ్వరరాజు నిరాహారదీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. రఘురామ అవినీతి, దౌర్జాన్యాలపై తాను గళం విప్పినందుకే కక్ష సాధిస్తున్నారని వెంకటేశ్వరరాజు ఆరోపిస్తున్నారు. నా ఇంటిని కూల్చి ప్రాణం ఉన్న శవాన్ని చేశారంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని కొద్దిరోజులుగా వెంకటేశ్వరరాజు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ గతంలో ఆరోపించాడు. ఈ నెల 17న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కార్యకర్త పొత్తూరి ఆరోపణలు చేయగా, 21వ తేదీన వెలిపర్రు గ్రామంలో వెంకటేశ్వరరాజు ఇంటిని కూల్చేశారు. నిత్యం పసుపు చొక్కానే ధరించే వెంకటేశ్వరరాజు విషయంలో పార్టీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పు ఎవరిది ఉన్నప్పటికీ, బాధితుడిని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాల్సివుంది కదా? అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.