కొలికపూడి కథ కంచికి.. చంద్రబాబు కీలక నిర్ణయం!

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ‘కొలికపూడి’ని పార్టీ నుంచి పంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోందని అంటున్నారు.;

Update: 2025-11-01 17:30 GMT

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ప్రధానంగా కొలికపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ‘కొలికపూడి’ని పార్టీ నుంచి పంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ కంటే తమ వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్ది మంది భావిస్తున్నారని, అలాంటివారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారని అంటున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి సమస్యాత్మకంగా వ్యవహరిస్తున్న కొలికపూడితో ఇక వేగలేమని, ఆయనే వెళ్లిపోతారని ఇన్నాళ్లు ఎదురుచూసిన అధినేత, ఇంకా ఎదురుచూడకూడదని భావిస్తున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. పార్టీ ఫండ్ పేరిట విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చానని ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఎంపీ చిన్ని కూడా దీటుగానే స్పందించారు. అయితే ఈ ఎపిసోడ్ వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నాదని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ పై నిర్ణయం తీసుకుంటానని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. కానీ, ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. విదేశీ పర్యటన ముందు ఓ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే కన్నా, తాను రాష్ట్రంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకుని, ఆ తర్వాత చోటుచేసుకోబోయే పరిణామాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యేపై వేటు నిర్ణయాన్ని ఓ వారం వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీని పిలిపించి మాట్లాడతానని చెప్పినప్పటికీ, ఎంపీ విషయం కొంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహారంలో ఎంపీ బహిరంగంగా స్పందించిన విధానంపైనే ముఖ్యమంత్రికి కొంత అభ్యంతరం ఉందని అంటున్నారు. అదే సమయంలో పరిస్థితి ఇంతవరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఎంపీ విస్మరించారనే సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే కొలికపూడి తరహాలోనే మరికొందరు నేతలు వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహంగా కనిపిస్తోందని అంటున్నారు. పరస్పర ఆరోపణలతో మీడియాకు ఎక్కడం గతంలో ఎన్నడూ చూడలేదని అభిప్రాయపడుతున్న ముఖ్యమంత్రి ఈ పద్ధతిని ఆదిలోనే అరికట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కొందరు సొంత అజెండాతో వెళుతున్నారని సీఎం దృష్టికి వెళ్లిందని అంటున్నారు. అలాంటి వారు సవతంత్రంగా పోటీ చేస్తే వారి సత్తా ఏంటో తెలిసేది కదా? అంటూ ఆయన సీనియర్ల వద్ద ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే ఎమ్మెల్యేగా గెలిచామన్న విషయం నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని సీఎం అంటున్నారు.

Tags:    

Similar News