కావలి ఓ హెచ్చరిక.. టీడీపీలో అలాంటి నియోజకవర్గాలు ఎన్ని?
కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు పెద్ద కర్మ సందర్భంగా చోటుచేసుకున్న ఘటన పార్టీలో అంతర్గత చర్చకు తెరలేపింది.;
కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు పెద్ద కర్మ సందర్భంగా చోటుచేసుకున్న ఘటన పార్టీలో అంతర్గత చర్చకు తెరలేపింది. పార్టీ అధికారం చేపట్టిన 17 నెలల్లోనే ఇలాంటి పోకడలు కనిపించడం, మునుముందు ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి? రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా గ్రూపు తగాదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అధిష్టానం ముందుగానే గ్రూపు తగాదాలపై దృష్టి పెట్టకపోతే కేడరులో నైరాశ్యం పెరిగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కావలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు గత నెల 20న మరణించారు. ఆయన అన్నకుమారుడు సైతం అంతకు ముందు రోజు మరణించారు. పార్టీలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న మాలేపాటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో విభేదాలు ఉన్నాయని, ఎమ్మెల్యే హవా వల్ల అధికారంలో ఉండి కూడా మాలేపాటి ఏ పనీ చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి లోనైన మాలేపాటి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారని కార్యకర్తలు చెబుతున్నారు.
తమ నేత మరణానికి పరోక్షంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశదిన కర్మనాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అడ్డుకున్నారు. ఈ పరిణామం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్నికల ముందు గెలుపు గుర్రాల పేరుతో కొందరిని పార్టీలోకి తీసుకున్నారని, అదేవిధంగా పొత్తుల వల్ల కొన్న సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలాంటి చోట్ల పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు గుర్తింపు ఉండటం లేదని అంటున్నారు.
మిత్రపక్షాల ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు విలువ లేకుండా పోతోందని అంటున్నారు. ప్రధానంగా టీడీపీలో తొలి నుంచి కొనసాగుతున్న నేతల ఉనికి ప్రశ్నార్థకం చేసేలా పరిస్థితులు మారుతుండటం ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియోజకవర్గాలు 20 వరకు ఉంటాయని కార్యకర్తలు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దకపోతే, భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.