ఇంటింటికో సమస్య...ఎమ్మెల్యే తమ్ముళ్ళ అంతర్మధనం!
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది బాగానే ఉంది అయితే ఇంకా కొంతమందికి ఇవ్వలేదని దానిలోనూ ఫిర్యాదులు ఉన్నాయి.;

ప్రజలకు రాజకీయ నాయకులు దూరంగా ఉంటారు అంటారు కానీ ఎందుకు అన్నది ఎవరూ చెప్పరు. ప్రజల వద్దకు వెళ్తే ఒక సమస్య తీరితే మరోటి తెస్తారు. అది నిరంతరం సాగే వ్యవహారం. అందువల్ల నాయకులు సాధారణంగా వేదికలు ఎంచుకుని అక్కడే సభలు పెట్టి మేము ఫలానా పనులు చేశామని తాముగా వన్ సైడెడ్ గా చెప్పాల్సింది చెప్పేసి వెళ్తారు.
అయితే ఇంటింటికీ వెళ్లమని టీడీపీ అధినాయకత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అంతా కలసి ప్రతీ ఇంటికీ వెళ్ళాలని కరపత్రాలు అందించాలని ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు ఏకరువు పెట్టాలని కోరుతోంది. అయితే ఇది మాటలతో చెప్పినంత ఈజీ కాదని అంటున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఉంది. కానీ జనాలకు అది చాలదు, గట్టిగా చెప్పాలంటే ప్రతీ ఇంటికీ అనేక సమస్యలు ఉన్నాయి.
ఇలా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్ళగానే అలా వారు చెబుతారు. మరి వాటికి పరిష్కారం అయితే అందుబాటులో ఉందా అన్నదే చర్చగా ఉంది. ఇక ఏడాది కాలంలో టీడీపీ చేసినవి చూస్తే మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసింది. ఇది మంచిదే కానీ కొత్తగా తమకు పెన్షన్లు ఇవ్వమని లక్షలలో అర్జీలు అలా పేరుకుపోయాయి. వారంతా మా సంగతేంటి అని ఎదురు ప్రశ్నిస్తారు.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది బాగానే ఉంది అయితే ఇంకా కొంతమందికి ఇవ్వలేదని దానిలోనూ ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా తల్లికి వందనం పధకం అమలు చేశారు. ఈ పధకం విషయంలో కూడా లక్షలలో చాలా మందికి కట్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు గత ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన వారికి ఇవ్వలేదు. దాంతో వారంతా గోల పెడుతున్నారు.
అంతే కాదు, నెలకు మూడు వందలకు పైగా విద్యుత్ యూనిట్లు వస్తున్నాయని చెప్పి అత్యధిక శాతం మందికి తల్లికి వందనం కట్ చేశారు అయితే తమవి ఉమ్మడి కుటుంబాలు అని తమకు ఈ విధంగా అన్యాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తల్లికి వందనం ఇవ్వమని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక రేషన్ వాహనాలను తీసేది రేషన్ ని డిపోల వద్దనే ఇస్తున్నారు. దాంతో మైదాన ప్రాంతాలలో అది బాగానే ఉన్నా గిరిజన ప్రాంతాలలో మారుమూల తండాలలో మాత్రం వాహనాలు తమ ప్రాంతానికి వస్తే బాగుంటుంది అని కోరుతున్నారు. వారంతా రేషన్ దుకాణాల వద్ద రేషన్ అంటే తమ వల్ల కాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వ్యక్తిగతంగా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. అంతే కాదు ఆయా నియోజకవర్గాలలో సమస్యలు ఉన్నాయి. చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. హామీలలో కూడా నెరవేర్చాల్సినవి అనేకం ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళి ఏమి మాట్లాడాలి అన్న సంశయంలో పడిపోతున్నారు.
ప్రస్తుతానికి అయితే వారు మధ్యేమార్గాన్ని ఎన్నుకున్నారు. టీడీపీ అనుకూలమైన ప్రాంతాలలోనే ప్రస్తుతం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సాగుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎమ్మెల్యేలు కీలక నేతలు ఆయా ప్రాంతానికి వచ్చి ఒక చోట ఉంటే క్యాడర్ ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందిస్తోంది. ఆ మీదట తమ వద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరిస్తూ పాజిటివిటీని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక కొంతమంది అయితే కరడు కట్టిన టీడీపీ అభిమానులు ఉన్న ఇళ్ళకు వెళ్ళి మరీ వారో ముచ్చటిస్తున్నారు. వారు వేసే పూలదండలు కప్పే శాలువాలూ చూపిస్తూ టీడీపీ కూటమి చేస్తున్న కార్యక్రమాలకు జనంలో మంచి మద్దతు దక్కుతోంది అని అంటున్నారు. మొత్తానికి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ విజయాల గురించి మాత్రం గట్టిగా చెబుతున్నారు.
అదే సమయంలో ఎక్కడైనా ప్రజలు సమస్యలు ప్రస్తావిస్తే చేయాల్సినవి ఉన్నాయి తాము చేస్తామని సున్నితంగా చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఓవరాల్ గా చూస్తే జనంలో ఏ మేరకు కూటమి ప్రభుత్వం మీద సంతృప్తి స్థాయి ఉంది అని చెప్పడానికి అయితే ఈ కార్యక్రమం ఏ మేరకు దోహొదపడుతుంది అన్నది చూడాల్సి ఉంది.