టీడీపీలో మరో రచ్చ: ప్రాధాన్యం తగ్గిస్తున్నారా... తగ్గుతోందా.. ?
టిడిపి లో ఇటీవల రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలో మంత్రి నారా లోకేష్ అదేవిధంగా పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.;
టిడిపి లో ఇటీవల రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలో మంత్రి నారా లోకేష్ అదేవిధంగా పలువురు ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో విస్తృతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ విస్తృతంగా పుంజుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా వైసీపీకి బలంగా ఉన్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు వీలుగా ఈ కమిటీలు పనిచేయాలన్నది చంద్రబాబు చేసిన దిశా నిర్దేశం.
ఈ క్రమంలోనే కొత్తవారికి అదేవిధంగా యువతకు కూడా ప్రాధాన్యం కల్పించారు. వీరికి పార్టీ పరంగా అన్ని విధాల అండదండలు ఉంటాయని కూడా చెప్పారు. అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నాయకులు కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలకు సహకరించటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తగా నియమించిన నాయకులు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు.. తలెత్తుతున్నాయి. దీంతో కొత్త నేతలు తమ పనులను చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
పేరుకు మాత్రం కొత్తగా నాయకత్వాన్ని నియమించారని, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సీనియర్ నేతలను తమ మాట వినేలా కనీసం సూచనలు చేసేలా ఏమాత్రం దిశా నిర్దేశం చేయకపోవడాన్ని కొత్త నేతలు తప్పుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే బాధ్యతలు చేపట్టిన తమకు ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి సహకారం లేకపోతే ఏ విధంగా ముందుకు సాగాలని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఉదాహరణకు కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కొత్తగా నియమించిన కమిటీలకు ఏమాత్రం సహకరించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
అదేవిధంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్తగా నాయకులను నియమించినప్పటికీ వారి ప్రభావం కూడా కనిపించడం లేదు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇది కొత్త నాయకత్వానికి ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయిన నాయకులకు కూడా ఇబ్బందికరంగా పరిస్థితులు తెచ్చేలాగా కనిపిస్తుంది. వీటిని సరిదిద్దాలని కొత్త నాయకత్వం పార్టీ అధిష్టానాన్ని కోరుతోంది.
అయితే ఇప్పుడే కమిటీలను ఏర్పాటు చేశామని త్వరలో పుంజుకునే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. మరోవైపు రెండు మూడు మాసాల్లోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నూతనంగా కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ లక్ష్యం ఏ మేరకు సాధిస్తారు.. ఏ మేరకు విజయం సాధించగలుగుతారు అనేది కమిటీలు పనిచేసే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది.
కానీ అసలు పని చేసుకునేందుకు అవకాశం కల్పించే వాతావరణం లేకపోవడం సీనియర్ నాయకులు స్పందించకపోవడం సహకరించకపోవడం అంటూ ఇప్పుడు ప్రధాన సమస్యలుగా మారాయి. వీటిని తక్షణం పరిష్కరించే దిశగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలన్నది కొత్తగా ఏర్పడిన కమిటీలు కోరుతున్నాయి. వీటిని పరిష్కారం చేయనంతవరకు తాము ఏ ప్రయత్నం చేసిన వృధా అవుతుందని కొందరు చెబుతున్నారు. మొత్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉండడం గమనార్హం.