ఇంకా వెయిట్ చేయిస్తే బాగోదు.. టీడీపీ నిర్ణయం?
ఈ క్రమంలో వీరిని ఇంకా వెయిట్ చేయిస్తే.. సరికాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని చంద్రబాబు చెవిలో కూడా వేశారు.
ఏపీ టీడీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వివిధ పార్టీలనుంచి వచ్చిన వారు.. అలానే .. టికెట్లు త్యాగం చేసిన సీనియర్ నాయకులు.. తమకు గుర్తింపు లేకుండా పోయిందని వగరుస్తున్నారు. మరికొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉన్నా.. పార్టీ అధిష్టానం వారికి నచ్చ జెపుతోంది. అయినప్పటికీ.. కొందరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.
ఇటీవల రాజ్యసభ స్థానాల భర్తీ జరిగిన అనంతరం.. ఈ అసంతృప్తి మరింత పెరిగిందని అంటున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వర్మ, దేవినేని ఉమా, పనబాక లక్ష్మి.. సహా అనేక మంది నాయకులు.. తమకు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి పనబాక లక్ష్మికి టీటీడీలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. కానీ.. తనకు ప్రజాప్రతిని ధిగా నామినేటెడ్‌పోస్టు కావాలని ఆమె కోరుతున్నారు.
ఇక, పిఠాపురం వర్మ సంగతిప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు.. గత ఎన్నికల వేళ.. మైలవరం టికెట్‌ను త్యాగం చేసి.. తన రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజయానికి కృషి చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. అలానే.. రాజ్యసభ సీటు కోసం వేచి చూసిన.. శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, ప్రస్తుత టీడీపీ నాయకుడు వర్ల రామయ్య.. ఇలా జాబితా చాలానే ఉంది.
ఈ క్రమంలో వీరిని ఇంకా వెయిట్ చేయిస్తే.. సరికాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని చంద్రబాబు చెవిలో కూడా వేశారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రస్థాయి కమిటీలు నియమించడంతో పాటు.. రాజ్యసభ సీట్లు కూడా భర్తీ అయిన నేపథ్యంలో వీరికి ఎలాంటి పదవులు ఇచ్చి సంతృప్తి పరచాల న్న విషయంపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నాయకుడికి అప్పగించారని తెలిసింది. దీని ప్రకారం త్వరలోనే ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.