కొందరే వేస్తున్న 'తొలి అడుగు' రీజనేంటి?
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'సుపరిపాలనకు తొలి అడుగు.';

ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'సుపరిపాలనకు తొలి అడుగు.' రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న దరిమిలా.. ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. అయితే.. మంత్రుల వరకు ఫర్వాలేదని అనుకున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదు.
వాస్తవానికి ఈ కార్యక్రమం ఉద్దేశం.. కేవలం ప్రజలను కలవడమే కాదు.. ప్రజలను కలిసే సమయంలో కూటమి పార్టీలను కూడా కలుపుకొని పోవాలన్నది చంద్రబాబు ఆలోచన. తద్వారా.. స్థానికంగా ఉన్న పొరపొచ్చాలను అధిగమించి.. నాయకుల మధ్య సఖ్యత ఏర్పడుతుందని చంద్రబాబు ఉద్దేశం అయితే.. దీనికి నాయకులు పెద్దగా మొగ్గు చూపడం లేదు. మంత్రులు, ఇతర నాయకులు కొందరు ఈ కార్యక్ర మాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. కానీ.. కూటమి నాయకులను మాత్రం కలుపుకొని పోలేక పోతున్నారు.
వాస్తవానికి మంత్రులు అయినా.. నిరంతరం చంద్రబాబు ముందు తిరుగుతుంటారు కాబట్టి.. వారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు.. కేవలం మొక్కుబడిగా రెండు గంటలు తిరిగేసి.. చేతులు దులుపుకొంటున్నారు. చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలోనే మంత్రులు.. మనసు పెట్టి చేస్తున్నారు. ఇలా చేస్తున్నా.. కూటమి నాయకులను కలుపుకొని పోవడం లేదు.
ఇక, తిరువూరు, విజయవాడ సెంట్రల్, మైలవరం వంటి కీలక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఈ కార్య క్రమం చేపట్టలేదు. అంతర్గతంగా టీడీపీలో నెలకొన్న వివాదాల కారణంగానే ఈ కార్యక్రమం చేపట్టలేదని తెలిసింది. ఇక, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ.. ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదు. వచ్చే వారు చూసుకుంటారులే.. అని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరికొందరు.. అసలు.. ఈ కార్యక్రమం ఇప్పుడే కాదని.. ఇంకా సమయం ఉందని చెబుతున్నారు ఎలా చూసుకున్నా.. కొందరు మాత్రమే తొలి అడుగు వేస్తున్నారన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది.