'తానా'కి వెళ్తారా.. చంద్రబాబు, లోకేష్ మాట వింటారా?

అవును... ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహా సభలు జూలై 3, 4, 5 తేదీల్లో జరగనున్నాయి.;

Update: 2025-06-30 04:27 GMT

'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా నెల రోజులపాటు ఇంటింటికీ వెళ్లాల్సిందేనని.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులను సమీక్షల నుంచి మినహాయిస్తున్నామని, నెలరోజులూ నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు.

ఇదే సమయంలో... కుటుంబ సాధికార సారథి (కే.ఎస్‌.ఎస్‌) నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యుల వరకు పార్టీ నాయకులంతా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా నెల రోజులపాటు ఇంటింటికీ వెళ్లాల్సిందేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టంగా చెప్పారు.

దీంతో... ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎంత సీరియస్ గా తీసుకుందనే విషయం స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన 'గడప గడపకు వైసీపీ' ని మించి ప్రజలతో నేతలు మమేకమవ్వాలని.. ఈ ఏడాదిలో చేసిన పనులు చెప్పుకోవాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. ఈ సమయంలో... కొంతమంది వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

అవును... ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహా సభలు జూలై 3, 4, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ నుంచి పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన చంద్రబాబు... ఈ సభలకు వెళ్లడానికి టిక్కెట్స్ బుక్ చేసుకున్నవారి వివరాలు తనవద్ద ఉన్నాయని తెలిపారు.

ఇదే సమయంలో... తానా, ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే.. ఇక్కడి ప్రజలు మీకు టాటా చెప్పేస్తారని.. ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది యువకులేనని.. అర్థం చేసుకునే సమయానికే ఐదేళ్లూ అయిపోతే మాజీలుగా మిగిలిపోతారని చంద్రబాబు సూటిగా, ఘాటుగా.. చురకలు, హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. దీంతో. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

పైగా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిచి చంద్రబాబు మాట్లాడారని, ప్రతీ శనివారం ఇదే కార్యక్రమం ఉండొచ్చని అంటున్న వేళ... నేతల్లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తానాకు వెళ్లాలా.. వద్దా.. అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు! మరి వారి ఫైనల్ డెసిషన్ ఏమిటనేది వేచి చూడాలి!

Tags:    

Similar News