మొన్న వైసీపీ.. నేడు టీడీపీ.. ఈసీతో కీలక భేటీ
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయినా ఎన్నికల కమిషన్ చుట్టూ పార్టీలు తిరగడం ఆగడం లేదు.;
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయినా ఎన్నికల కమిషన్ చుట్టూ పార్టీలు తిరగడం ఆగడం లేదు. ఈవీఎంలపై తమ అనుమానాలను నివృత్తి చేయాలని నాలుగు రోజుల క్రితం వైసీపీ నేతలు ఈసీని కలవగా, తాజాగా ఐదు ప్రతిపాదనలతో టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉన్నప్పటికీ ఈసీని టీడీపీ నేతలు కలవడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బిహార్ లో వివాదాస్పదంగా మారిన ఓట్ల తొలగింపు ప్రక్రియను రాష్ట్రంలో ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని కోరడంతోపాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలతో టీడీపీ నేతలు ఈసీని కలిసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం బిహార్ లో స్థానికేతరుల ఓట్లను ఈసీ తొలగిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పేరిట బిహార్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు చేపట్టిన ఈ ప్రక్రియ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఓట్లను లక్ష్యంగా చేసుకుని భారీగా తొలగిస్తున్నారని బిహార్ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఈ విషయమై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్, ఆర్జేడీతోపాటు ఇతర విపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియతోపాటు మరికొన్ని అంశాలపై సూచనలు చేస్తూ టీడీపీ నేతల బృందం ఈసీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలు ఈసీని కలవడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఏటా ఓటర్ల జాబితాపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రతిపాదించడంతోపాటు ఏఐ సాయంతో నకిలీ, వలదారులు, చనిపోయిన వారి ఓట్లు రియల్ టైములో తొలగించాలని కోరింది. ఆధార్ సాయంతో డూప్లికేట్ ఓట్లను తొలగించాలని, ఓటర్ల జాబితాల సవరణలో అన్ని గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు బిఎల్వోలకు సమాచారం ఇవ్వాలని ప్రతిపాదించింది.
ఈసీ వెబ్ సైట్ లో జిల్లాల వారీగా ఓటర్ల మార్పులు, చేర్పుల వివరాలు, వాటి కారణాలను అప్ లోడ్ చేయాలని కోరింది. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని రియల్ టైములో పరిష్కరించడానికి డ్యాష్ బోర్డులు నిర్వహించాలని కూడా కోరింది. ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియలో తప్పు చేస్తే బాధ్యుల్ని చేసేలా చర్యలు ఉండాలని తెలిపింది. స్థానికంగా పక్షపాతం చూపకుండా బూత్ లెవల్ ఎన్నికల అధికారుల రొటేషన్ చేయాలని కోరింది. రాష్ట్రస్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం ఓ అంబుడ్స్ మెన్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరింది.
నివాసం లేని వారు, వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కూడా కోరింది. వీరి కోసం నామమాత్రపు ఆధారాలతో అయినా తాత్కాలిక అడ్రస్ ఇచ్చేలా చూడాలని కోరింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నెలకోసారి ఓటర్ల జాబితాలపై సమీక్ష నిర్వహించాలని కూడా సూచించింది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణకు తగిన సమయం ఇవ్వాలని, ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మళ్లీ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా చూడాలని, సమగ్ర విచారణ లేకుండా ఓట్లను తొలగించకూడదని, ఓటరు గుర్తింపు ఆధారాల్ని తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండాలని, ఓటర్లపై కాదని తెలిపింది. అలాగే సవరణ పరిధి తెలియాలని, మొబైల్ బీఎల్వో యూనిట్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు తాత్కాలికంగా అయినా ఓటు హక్కు కల్పించాలని, ఓట్ల తొలగింపుకు సమగ్ర విచారణ చేయాలనీ కోరింది.