మంత్రులకు చెమ్కీలు.. గ్రౌండ్ లెవిల్ టాక్ ఇదే.. !
విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కీలక మంత్రుల వరకు ఈ సెగ తగులుతోంది.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కించుకున్నవారిలో కొందరు వ్యవహరిస్తున్న తీరు.. గ్రౌండ్ లెవిల్లో వారికి సెగ పెడుతోంది. ఒకరు కాదు.. ఇద్దరుకాదు.. దాదాపు సగం మంది మంత్రుల పనితీరును సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. దీంతో మండలస్థాయిలో నాయకులు రాజీనామా బాట పడుతున్నారు. విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కీలక మంత్రుల వరకు ఈ సెగ తగులుతోంది.
సీమలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులకు అందుబాటులో లేకపోవడం.. ఒక కారణమైతే.. కనీసం సమస్యలు పరిష్కరించే వెసులు బాటు కూడా.. మంత్రులకు లేకపోవడం.. ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నవారిలో సగం మందికి పైగా.. తొలిసారి మంత్రులు అయిన వారే. దీంతో వారు నియోజకవర్గం సమస్యలను పక్కన పెట్టి.. పేరు కోసం తహతహలాడుతున్నారు. ఇది గ్రౌండ్ లెవిల్లో వారికి ఇబ్బందిగా మారింది.
పైకి అంతా బాగుందని చెబుతున్నా.. గ్రౌండ్ లెవిల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కే.గంగవరం.. పామర్రు గ్రామానికి చెందిన టీడీపీ క్రియశీలక సభ్యుడు, సీనియర్ నాయకుడు చిట్టూరి వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, ఈ సమస్యను మంత్రి సుభాష్ దృష్టికి, పార్టీ నాయకుల తీసుకువెళ్లగా అవమానపరిచినట్టుగా వ్యవహరించారన్నారు. దీనిపై అసంతృప్తి చెంది రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.
ఈ సమస్య ఒక్క మంత్రి సుభాష్ నియోజకవర్గంలోనే ఉందని అనుకుంటే పొరపాటే.. పలు ప్రాంతాల్లోనూ ఉంది. మంత్రి సవిత, మంత్రి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌రెడ్డి సహా.. పలువురు మంత్రుల ఇలాకాలో సొంత పార్టీ నాయకులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది పైకి వైసీపీ నాయకుల ప్రభావం ఉందని సరిపుచ్చుకుంటే.. అది ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కనీసం ఇప్పటికైనా మంత్రులుగా ఉన్నవారు.. తమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి సరిచేసుకునే దిశగా అడుగులువేయాల్సి ఉంటుంది.