దళపతిపై కుట్ర.. ఛేదించిన చెన్నై పోలీసులు, డీఎంకే నేతపై అనుమానాలు

తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్న సమాచారం పెను సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-07-01 11:55 GMT

తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్న సమాచారం పెను సంచలనం సృష్టిస్తోంది. అధికార టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని డీఎంకే ప్రయత్నిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముందుగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై విపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానికి మద్దతు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాతో కొందరు బేరసారాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. తమకు మద్దతు ఇస్తే రూ.35 కోట్లు ఇస్తామని లేదంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించడంతో ఎమ్మెల్యే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రను ఛేదించారని అంటున్నారు.

ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చెన్నైలోని ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. రాజకీయాలపై సర్వేలు చేసే ఆ సంస్థ ప్రతినిధులతో డీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో డీఎంకే పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతోపాటు ఆయన సోదరుడు అశోక్ కుమార్ కు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయన్న సమాచారం తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. టీవీకే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటన చేసిన రెండు రోజులకే ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు బయటపడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ సంచలన విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లేకపోయినా, డీఎంకే కూటమికి చెందిన వీసీకే, కమ్యూనిస్టులు, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ ప్రభుత్వాన్ని ఎన్నాళ్లు కొనసాగనిచ్చేది లేదని డీఎంకే చేస్తున్న హెచ్చరికలతో ముఖ్యమంత్రి విజయ్ అప్రమత్తమయ్యారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని అంటున్నారు. విపక్షంలోని ఏఐడీఎంకే ఎమ్మెల్యేలతో వరుసగా రాజీనామాలు చేయిస్తూ, వారిని తన పార్టీలో చేర్చుకుని ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీఎం భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి సుస్థిరత తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో టీవీకే పార్టీని చీల్చేవిధంగా ప్రత్యర్థులు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, తీగ లాగితే ఎవరి గుట్టు బయటపెడతారోనని ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రధానంగా ఈ పరిణామాలు డీఎంకే పార్టీ నేతలను టెన్షన్ కు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తాజా ఘటన ముఖ్యమంత్రి విజయ్ సమర్థతను బయటపెట్టిందని అంటున్నారు. ప్రత్యర్థులను గురిచూసి కొట్టడంలో విజయ్ అందెవేసిన చేయిగా తయారయ్యారని, కుట్ర కోణం బయటపెట్టడం ద్వారా రాజకీయంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News