డిప్యూటీ సీఎంకు ఒక న్యాయం.. డిప్యూటీ స్పీకర్ కు మరో న్యాయమా? ప్రభుత్వంపై రఘురామ ఫైర్!
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను దూషిస్తున్న, సమాధి చేస్తామని హెచ్చరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను దూషిస్తున్న, సమాధి చేస్తామని హెచ్చరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసేందుకు 72 గంటల సమయం ఇస్తున్నానని లేనిపక్షంలో ఏం జరుగుతుందో చూద్దామంటూ అల్టిమేటం జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను మాట అన్న వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ప్రభుత్వం, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎందుకు ఆలోచిస్తోందని నిలదీశారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న తాను రాజ్యాంగం కోసం మాట్లాడితే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని, అలా భరితెగించి మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోరా? అంటూ రఘురామరాజు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంపై దాడిగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగం రక్షించలేని దుస్థితి ఏ రాష్ట్రంలో ఉండదని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలీసుశాఖకు అర్థం లేదని, లా అండ్ ఆర్డర్ శాఖ వ్యర్థమని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేయాల్సిందేనని రఘురామ ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన విషయాలే తాను చెప్పానని, అందుకు తనను చంపేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తనను రాజ్యాంగ పదవిలో ఎందుకు నియమించారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ అరెస్టు విషయంలో కూటమి ప్రభుత్వం వెనకాడుతుందనే ఆగ్రహం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజులో స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 28న ఏలూరులో జరిగిన సమావేశంలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ డిప్యూటీ స్పీకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామను సమాధి చేస్తామని హెచ్చరించారని చెబుతున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఇదేవేదికపై హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ రావణ్ డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. మంగళవారం రాత్రి రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేయలేదంటూ రఘురామ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జడ శ్రవణ్ కుమార్ పై ఏలూరులో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వెల్లడించారు. జడ శ్రవణ్ కుమార్ శిశుపాలుడిలా తప్పులు చేస్తున్నారని, ఆయనకు ఇచ్చిన అవకాశాలు అన్నీ అయిపోయినందున తక్షణం అరెస్టు చేయాల్సిందేనంటూ ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు రఘురామ మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకు ఒక న్యాయం, డిప్యూటీ సీఎంకు మరో న్యాయమా? అన్నట్లు రఘురామ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకింత ఆగ్రహంతో తీవ్ర స్వరంతో రఘురామ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.