డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. టీవీకే ఎమ్మెల్యేలంతా రాజీనామా?
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.;
తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం చోటుచేసుకుంటోంది. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే ద్రవిడ దిగ్గజాలు డీఎంకే-అన్నాడీఎంకే చేతులు కలుపుతాయన్న ఊహాగానాలు ఒకెత్తయితే ఒకవేళ అదే జరిగితే తాము రాజీనామాలకు సిద్ధమంటూ విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) ప్రకటించడం భారత రాజకీయాల్లోనే అపూర్వ ఘట్టానికి తెరలేపుతోంది.
ద్రవిడ పక్షాల 'అపవిత్ర' కలయిక?
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి ఈ రెండు పార్టీలు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఒకవేళ ఈ రెండు పార్టీలు అనైతిక కూటమిగా ఏర్పడితే టీవీకే తన గొంతుకను బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది.
107 మంది ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా?
టీవీకే అధినేత విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ కేవలం పదవుల పంపకం కోసం డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటవుతే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని సంకల్పించినట్లు పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. "ప్రజలు మార్పు కోసం ఓటేశారు. కానీ పాత శక్తులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే మేము ఆ వ్యవస్థలో భాగస్వాములుగా ఉండలేం. పదవుల కంటే మాకు ప్రజల నమ్మకమే ముఖ్యం" అని టీవీకే నేతలు స్పష్టం చేస్తున్నారు.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. రాజ్యాంగ సంక్షోభం దిశగా?
మరోవైపు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. రాజ్యాంగబద్ధంగా ఏ కూటమికైనా మెజారిటీ ఉంటే తాము ఆహ్వానించక తప్పదని ఆయన పేర్కొన్నారు. "ఈరోజే వారు మెజారిటీ నిరూపిస్తే రేపే ప్రమాణ స్వీకారం చేయిస్తాను" అని గవర్నర్ వ్యాఖ్యానించడం ద్వారా డీఎంకే-అన్నాడీఎంకే కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం చేసినట్లయింది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు హీటెక్కాయి..
ఎన్నికల్లో పరస్పరం విమర్శించుకున్న పార్టీలు అధికారం కోసం కలవడం ఓటర్లను మోసం చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 107 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేస్తే అది రాష్ట్రంలో భారీ రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. ఇది ఉప ఎన్నికలకు లేదా మధ్యంతర ఎన్నికలకు దారితీసే అవకాశం ఉంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో 'నైతికత'ను ఆయుధంగా మలచుకుని ప్రజల్లో మరింత పట్టు సాధించే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు అధికార దాహం, ఇటు నైతిక పోరాటం మధ్య తమిళ తంబిల భవిష్యత్తు ఊగిసలాడుతోంది. ఒకవేళ టీవీకే ఎమ్మెల్యేల రాజీనామాలు వాస్తవ రూపం దాల్చితే అది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అతిపెద్ద మలుపుగా నిలిచిపోతుంది. రాబోయే 24 గంటలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.