అటు దళపతి.. ఇటు సింగం.. అమ్మ పార్టీ ఉక్కిరిబిక్కిరి

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Update: 2026-06-04 15:30 GMT

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా విపక్షంలోని అన్నాడీఎంకేని టార్గెట్ చేసినట్లు అధికార టీవీకే పార్టీ పావులు కదుపుతోందని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో టీవీకేకు డీఎంకేతోనే పోటీ ఉంటుందని ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో కొత్తగా పార్టీ పెడతానంటున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం అన్నాడీఎంకే కేడర్ పై ఫోకస్ చేశారని చెబుతున్నారు. దీంతో పార్టీ నేతలను కాపాడుకోవడం అన్నాడీఎంకే హైకమాండ్ కు సవాల్ గా మారిందని అంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలతో ఉన్నంతవరకు తమిళనాడులో పటిష్టంగా ఉన్న అన్నాడీఎంకే.. ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఇప్పటికే చాలా మంది పార్టీ నుంచి తప్పుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నాడీఎంకేకి రాజీనామా చేసి డీఎంకేలో చేరారు. ఇక ఎన్నికల అనంతరం వేలుమణి, షణ్మగం తదితరుల నేతృత్వంలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అధికార టీవీకేకు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాలతో అన్నాడీఎంకే హైకమాండ్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా నిరోధించేందుకు ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్న దశలో అన్నామలై రూపంలో మరో సవాల్ ఎదురుకావడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డైలమాలో పడిపోయారని అంటున్నారు. పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల్లో నలుగురు తమ పదవులకు రాజీనామా సమర్పించి టీవీకేలో చేరిపోయారు. వీరి దారిలో మరికొందరు కూడా ఉన్నారని జరుగుతున్న ప్రచారంతో అన్నాడీఎంకే ఉక్కిరిబిక్కిరి అవుతోందని అంటున్నారు.

దాదాపు 50 ఏళ్ల పార్టీ ప్రస్తానంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, తమ స్థానాన్ని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆక్రమించిందన్న ఆలోచనతో అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ ముక్కలు చెక్కలు అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలు అధికార టీవీకే వైపు చూస్తుండగా, క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు కొత్త పార్టీ పెడుతున్న అన్నామలై ప్రకటన కోసం వేచిచూస్తున్నారని అంటున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News