'బీచ్ వెడ్డింగ్' హవా.. పర్యాటక శాఖ సరికొత్త విందు.. బడ్జెట్ పెళ్లిళ్లకు కేరాఫ్!

పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుపుకునే మధుర ఘట్టం, అందుకే ఈ వేడుకను అత్యంత ప్రత్యేకంగా జరుపుకోవాలని నేటి తరం యువతీయువకులు ఆరాటపడుతున్నారు.;

Update: 2026-03-09 09:30 GMT

పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుపుకునే మధుర ఘట్టం, అందుకే ఈ వేడుకను అత్యంత ప్రత్యేకంగా జరుపుకోవాలని నేటి తరం యువతీయువకులు ఆరాటపడుతున్నారు. పాతకాలం నాటి కళ్యాణ మండపాలు, ఇంటి వద్ద పెళ్లిళ్ల కంటే.. ప్రకృతి ఒడిలో, అందమైన లొకేషన్లలో 'డెస్టినేషన్ వెడ్డింగ్' చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. సెలబ్రిటీలకే పరిమితమైన ఈ ఖరీదైన సంస్కృతిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో తమిళనాడు ప్రభుత్వం ఒక అద్భుతమైన అడుగు వేసింది.

తక్కువ ధరకే బీచ్ వెడ్డింగ్ భాగ్యం!

తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TTDC) సముద్ర తీరాన వివాహ వేడుకలు జరుపుకునేలా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ రిసార్టులు లక్షల్లో వసూలు చేసే చోట, ప్రభుత్వం అత్యంత తక్కువ ధరకే ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. తొలుత మామల్లాపురంలోని తమిళనాడు బీచ్ రిసోర్ట్ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెన్యూ బుకింగ్ ఫీజు కేవలం రూ. 10 వేలు మాత్రమే ఉండడం విశేషం. వింధు భోజనం విషయానికి వస్తే, వెజిటేరియన్ మీల్స్ ఒక్కో వ్యక్తికి రూ. 1,100 నుండే ప్రారంభమవుతున్నాయి. అలాగే, పెళ్లికి వచ్చే అతిథుల కోసం రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. 22 గంటల స్టే కోసం కేవలం రూ. 5 వేలు చెల్లిస్తే చాలు.

ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు?

ఈ పథకంలో ప్రభుత్వం అందమైన బీచ్ ప్రాంతాన్ని, కేటరింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, వివాహ వేదిక, డెకరేషన్స్, లైటింగ్ వంటి బాధ్యతలను మాత్రం కుటుంబ సభ్యులే చూసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని కోవలం, మరీనా, నాగపట్టణం, రామనాథపురం వంటి బీచ్‌లను అంతర్జాతీయ 'బ్లూ ఫ్లాగ్' ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల అటు పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, పెళ్లి చేసుకునే జంటలకు ఒక మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది.

పర్యాటక అభివృద్ధి, బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు

తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక వ్యూహంగా కూడా చూస్తోంది. రాష్ట్రంలోని కోవలం, మరీనా, నాగపట్టణం, రామనాథపురం వంటి బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల సముద్ర తీరాలు శుభ్రంగా, పర్యాటకులకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ బీచ్‌లలో పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్థిక చేయూత - బంగారం కూడా!

కేవలం బీచ్ వెడ్డింగ్ సౌకర్యమే కాకుండా, అర్హులైన నవ వధూవరులకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా కూడా అండగా నిలుస్తోంది. 'మూవలూర్ రామమిర్తమ్ అమ్మైయార్ మ్యారేజ్ అసిస్టెన్స్ స్కీమ్' కింద రూ. 50 వేలు ఆర్థిక సాయంతో పాటు, మంగళసూత్రం కోసం 8 గ్రాముల బంగారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఇలాంటి పథకాల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెళ్లి భారం తగ్గడమే కాకుండా, వారి జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒకపక్క తక్కువ ధరకే బీచ్ వెడ్డింగ్ లొకేషన్ ఇస్తూ, మరోపక్క పెళ్లికి అవసరమైన ఆర్థిక సాయం అందించడం నిజంగా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయం.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం. సముద్రపు అలల సాక్షిగా, చల్లని గాలి మధ్య మూడు ముళ్లు వేయించుకోవాలని అనుకునే మధ్యతరగతి జంటలకు ఇదొక గొప్ప అవకాశం. మన దగ్గర కూడా వైజాగ్ వంటి బీచ్‌లలో ఇలాంటి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందనిపిస్తోంది కదా! టూరిజాన్ని పెంచడంతో పాటు సామాన్యుడి కలను నెరవేరుస్తున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News