షాకింగ్: 'కాక్రోచ్ పార్టీ' ఫౌండర్‌పై దాడి చేసిన నిందితులకు పూలమాలలతో ఘన స్వాగతం!

దేశవ్యాప్తంగా యువతలో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.

Update: 2026-06-17 12:13 GMT

దేశవ్యాప్తంగా యువతలో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. జూన్ 15న జైపూర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దీప్కేను చెంపదెబ్బలు కొట్టి జైలుకు వెళ్లిన నిందితులను పోలీసులు బుధవారం విడుదల చేశారు. జైపూర్‌లోని విద్యాక్‌పురి పోలీస్ స్టేషన్ నుంచి కేవలం రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే పోలీసు స్టేషన్ బయట నిందితులకు పూలమాలలతో స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.

పోలీస్ స్టేషన్ ముందే ఘన స్వాగతం!

నిందితులు బెయిల్‌పై బయటకు రాగానే పోలీస్ స్టేషన్ వెలుపల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుల మద్దతుదారులు వారికి పూలమాలలు వేసి, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 'జైశ్రీరాం', 'భారత్ మాతా కీ జై', 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారని చెబుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగింది?

దేశంలో నిరుద్యోగం, అవినీతి, నీట్ పేపర్ లీక్ తదితర అంశాలపై సీజేపీ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నీట్ పేపరు లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న జైపూర్ లో నిర్వహించిన ధర్నాకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వచ్చారు. అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలకగా, వారి సమక్షంలో ఓ యువకుడు అభిజిత్ దీప్కే చెంప చెల్లు మనిపించాడు. ఈ పరిణామంతో షాక్ తిన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు.

రాజకీయ రంగు పులుముకున్న దాడి

కాగా, ఈ దాడికి పాల్పడిన వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందినవారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. కాగా, ఈ దాడిపై దీప్కే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తాను గాంధీ, అంబేద్కర్ మార్గంలో నడిచేవాడిని. యువత హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రశ్నించే వారిని పాకిస్తానీయులు అంటూ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు మేము లొంగమని తేల్చిచెప్పడంతోపాటు జూన్ 20న 'ఢిల్లీ చలో' కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ట్రెండింగ్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ'

బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేసిన 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే ఈ వినూత్న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా వ్యంగ్యాస్త్రాలతో ప్రారంభమైన ఈ డిజిటల్ ఉద్యమం, ప్రస్తుతం వీధుల్లోకి వచ్చి దేశవ్యాప్త యువజన ఉద్యమంగా రూపాంతరం చెందిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా దాడి జరగడం, నిందితులకు ఘన స్వాగతం లభించడం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది.



Tags:    

Similar News